iDreamPost

పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డకు కక్ష ఎందుకు..?

పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డకు కక్ష ఎందుకు..?

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేయడం అత్యంత వివాదాస్పద అంశం. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా.. వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌జగన్‌ తన సమయాన్ని అంతా పాలనపైనే కేంద్రీకరించారు. ఈ బాధ్యతలను ఆయా శాఖల మంత్రులు తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలను పంచాయతీరాజ్‌ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, పురపాలక ఎన్నికలను ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీకి ఎంత బాధ్యత ఉందో.. ప్రభుత్వానికి అంటే.. ఆయా శాఖలకు అంతకుమించి ఎక్కువ బాధ్యత ఉంది. అలాంటిది ఆయా శాఖల మంత్రులైన పెద్దిరెడ్డి, బొత్సలను లక్ష్యంగా చేసుకుని ఎస్‌ఈసీ మాట్లాడడం, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, కోర్టుకు వెళతానంటూ హెచ్చరించడం లాంటి విపరీత పోకడలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరించారు. ఇప్పుడు ఏకంగా పంచాయతీ రాజ్‌ మంత్రిని ఇంటికే పరిమితం చేయండంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం మంత్రులను నియంత్రించేందుకు నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుకు పరాక్షాష్ట.

నిమ్మగడ్డ రహస్య అజెండా..

మంత్రిని ఎన్నికలకు దూరంగా ఉంచే అధికారం ఎస్‌ఈసీకి ఉందా..? ఇది రాజ్యంగబద్ధమేనా..? న్యాయస్థానాల్లో నిలబడుతుందా..? అనే అంశాల సంగతి ఎలా ఉన్నా.. అసలు నిమ్మగడ్డ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటి..? వాయిదా పడిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించకుండా.. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయడం వెనుక నిమ్మగడ్డకు రాజకీయపరమైన లక్ష్యాలున్నాయనేది వైసీపీ నేతల అనుమానం. ఈ అనుమానాలకు బలం చేకూరేలా నిమ్మగడ్డ ప్రైవేటు ఈ వాచ్‌ యాప్‌ను తెచ్చారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల గ్రామాల్లో ప్రజల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా ఇది ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి లాభిస్తుంది. అందుకే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఏకగ్రీవాలపై ప్రతి జిల్లాలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. విభేదాలు వచ్చినా.. మళ్లీ పోతాయని చెబుతూ పోటీ చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో నిమ్మగడ్డ లక్ష్యం ప్రస్ఫుటమైంది. వైసీపీ నేతల అనుమానం నిజమైంది.

నిమ్మగడ్డ ప్రయత్నాలకు పెద్దిరెడ్డి గండి..

నిమ్మగడ్డ లక్ష్యాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గండికొడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన విధుల్లో ఉంటూ రాజకీయ నాయకుడులా వ్యవహరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్న నిమ్మగడ్డకు ఎక్కడికక్కడ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చెక్‌ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏకగ్రీవాలను తాత్కాలికంగా ఆపాలంటూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంలోని లోపాలును మంత్రి పెద్దిరెడ్డి ఎత్తి చూపారు. రిటర్నింగ్‌ అధికారులకు ఉన్న అధికారాలను గుర్తు చేశారు. నిబంధల మేరకు పని చేయాలని రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తూ.. ఎవరైనా పని చేస్తే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఇది నిమ్మగడ్డ ప్రయత్నాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ప్రస్తుతం మొదటి దశ ఎన్నికల నామినేషన్లు పూర్తయాయి. 16.09 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా మూడు దశలు ఉన్నాయి. గత ఎన్నికల్లో దాదాపు 20 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిమ్మగడ్డ మాత్రం గతం కన్నా తక్కువ అవుతాయని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మంత్రిని ఇంటికి పరిమితం చేయడం, మీడియాతో మాట్లాడనీయకుండా చేస్తే.. తాను అనుకున్న పనిని చేయవచ్చనే లక్ష్యంతో నిమ్మగడ్డ మంత్రిపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారనేది కాదనలేని సత్యం. నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం న్యాయస్థానాల్లో నిలబడుతుందా..?లేదా..? అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి