iDreamPost

చంద్రబాబు క్వాష్ పిటీషన్ AP హైకోర్టు కొట్టేయడానికి అసలు కారణం ఇదే?

చంద్రబాబు క్వాష్ పిటీషన్ AP హైకోర్టు కొట్టేయడానికి అసలు కారణం ఇదే?

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టి రిమాండ్ రిపోర్టును తయారు చేసింది. ఆ తరువాత ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశపెట్టి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. బాబు తరపున, సీఐడీ తరపున వాదనలు విన్న ఏసీబీ కోర్టు సీఐడీ వాదనలతో ఏకీభవించి బాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ బాబు తరపున ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పును వెల్లడించింది. అసలు బాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేయడానికి గల కారణం ఏంటి అనేది చర్చనీయాంశం అయ్యింది. ఈ అంశంపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

క్వాష్ పిటీషన్ కొట్టేయడానికి కారణం ఇదే?

కాగా సీఆర్పీసీలో సెక్షన్ 482 కింద సుప్రీం కోర్టులో గానీ హైకోర్టులో గానీ క్వాష్ పిటిషన్ వేసే వెసలుబాటు ఉంది. తన ప్రమేయం లేకపోయినా కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సెక్షన్ 17ఎ కింద అరెస్టు చెల్లదన్న బాబు తరపు లాయర్ల వాదనను హైకోర్టు అంగీకరించలేదు. దీనిపై పొన్నవోలు మాట్లాడుతూ.. బాబు ఎంతసేపు స్కామ్ జరగలేదు నాకు సంబంధం లేదని అంటున్నారే తప్పా చట్టం ముందు నిరూపించుకోలేక పోతున్నారని ఏఏజీ పొన్నవోలు అన్నారు. తనను అరెస్టు చేసేటపుడు పర్మిషన్ తీసుకోలేదని, రిమాండ్ రిపోర్ట్ సరిగా లేదు అనే విషయం తప్ప వారి యొక్క నిర్థోషిత్వం ఎక్కడా చెప్పట్లేదని తెలిపారు.

టెక్నికల్ గా బాబు లాయర్లు చేసే వాదనలు తప్పు వాదనలు అని హైకోర్టు తేల్చిందని అన్నారు. అసలు సెక్షన్ 482 ఒక ఎఫ్ఐఆర్ ను పురిట్లోనే తుంచేయొద్దని చెప్పింది. కానీ చంద్రబాబు లాయర్లు ఆదిలోనే తుంచేయాలని క్వాష్ పిటీషన్ వేశారన్నారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేశారనడంలో అర్థం లేదని రెండు సార్లు ఆధారాలు ఉన్నాయని ప్రూవ్ అయ్యాయని ఏఏజీ తెలిపారు. సీఐడీ చేసిన ప్రాథమిక విచారణలో ప్రాథమిక ఆదారాలు ఉన్నాయనే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పుడు హైకోర్టు కూడా అదే విషయంతో ఏకీభవించింది కనుకనే క్వాష్ పిటిషన్ ను కొట్టేసిందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి