iDreamPost

అమరావతి ఉద్యమ సభలు జిల్లాల్లో ఎందుకు పెట్టడం లేదు..?

అమరావతి ఉద్యమ సభలు జిల్లాల్లో ఎందుకు పెట్టడం లేదు..?

నేను సవాల్‌ చేస్తున్నా.. సీఎం వైస్‌ జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే రాజధాని అమరావతిపై రెఫరెండం పెట్టాలి. అందులో జనం అమరావతిని కోరుకుంటారో..మూడు రాజధానులకు మద్ధతిస్తారో తేలిపోతుంది. వారు మూడు రాజధానులకు మద్ధతిస్తే ఇక నేను నోరెత్తను.. ఈ విధంగా నిన్న మంగళవారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు సెలవిచ్చారు. నిన్ననే కాదు ఇటీవల పలుమార్లు ఇదే విధంగా చంద్రబాబు మాట్లాడారు.

అమరావతినే రాజధానిగా ఉండచాలని.. మూడు రాజధానులు వద్దంటూ చంద్రబాబు 50 రోజులుగా అనేక రూపాల్లో తన వాదనను వినిపిస్తున్నారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజుతో అమరావతి ఉద్యమం మొదలై 50 రోజులు కావస్తోంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని చంద్రబాబు అమరావతి ప్రాంతంలో నిరసనలు చేస్తున్న మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డుల్లో రైతు శిబిరాల వద్దకు వెళుతున్నారు. ఇన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తున్న చంద్రబాబు.. అమరావతి ఐదు కోట్ల ప్రజలదంటూ చెబుతున్నప్పటికీ రాజధాని ప్రాంత గ్రామాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ఎందుకు వెళ్లడంలేదో సెలవియ్యాలి. ఎప్పుడో జోలె పట్టుని మచిలీపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాలకు వెళ్లారు. అక్కడ నిర్వహించిన రోడ్‌షోలకు ప్రజలు పదుల సంఖ్యలో వచ్చి కదం తొక్కడంతో బాబు గారు అప్పటి నుంచి అమరావతి చుట్టు పక్కల ప్రాంతాలు మినహా మరెక్కడికీ పోవడంలేదు.

జిల్లాలో సభ పెట్టోచ్చు కదా..?

రాజధాని పోరాటం కేవలం రాజధాని గ్రామాలదే కాదు. 13 జిల్లాల ప్రజలది. యువత భవిష్యత్‌కు సంబంధించినది. దీని కోసం పోరాటం చేయాల్సిన అవసరముందంటున్న చంద్రబాబు.. మరి 13 జిల్లాలో కూడా రాజధాని సభలు పెట్టొచ్చు కదా. నిన్న మంగళవారం తెనాలిలో నిర్వహించిన సభలాగా గ్రీన్‌ మ్యాట్‌లు, కూర్చునేందుకు కుర్చీలు వేసి, చల్లని సాయంత్రం పూట సభలు పెట్టోచ్చు కదా..? భారీగా జన సమీకరణ కూడా చేసి సభలను విజయవంతం చేయొచ్చు. తద్వారా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల ప్రజలు రాజధానిగా అమరావతే కావాలంటున్నారని సభల ద్వారా చాటి చెప్పొచ్చు కదా..?

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ నిర్వహించినట్లుగా యువ భేరీలు నిర్వహించి యువతకు రాజధాని అమరావతి ప్రాముఖ్యాన్ని వివరించొచ్చు కదా..? ఇదిగో చూడు జగన్‌.. చిన్నాపెద్దా, యువత అందరూ అమరావతినే కావాలంటున్నారు అని చెప్పవచ్చు. అయినా కూడా జగన్‌ మూడు రాజధానుల ఏర్పాటుకే మొగ్గు చూపితే అప్పుడు రిఫరెండం పెట్టాలంటూ డిమాండ్‌ చేయవచ్చు. నా బాధ ప్రపంచం బాధ అని చలం అన్నట్లుగా.. చంద్రబాబు బాధ రాష్ట్ర ప్రజల బాధగా ఆయనే చెప్పుకుంటున్నారు. అమరావతి ఉద్యమాన్ని గామాల నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు విస్తరించే సాహసం చేయరుగానీ.. ముఖ్యమంత్రి మాత్రం రెఫరెండడం పెట్టాలట. చాలా బాగుంది బాబు గారు మీ తీరు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి