iDreamPost

కొత్త మంత్రివర్గంలో ఆ ముగ్గురూ ఎవరూ, మహిళా నేతల ఎదురుచూపులు ఫలించేనా

కొత్త మంత్రివర్గంలో ఆ ముగ్గురూ ఎవరూ, మహిళా నేతల ఎదురుచూపులు ఫలించేనా

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకి అంతా సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తేల్చేయడంతో కొత్తగా అవకాశాల కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. అందులో వివిధ కోటాల ప్రకారం కేటాయింపులు ఉంటాయనే అంచనాలతో మహిళా నేతల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. జగన్ తన తొలి క్యాబినెట్లోనే ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చారు. ఆ ముగ్గురి స్థానంలో ఈసారి కొత్తవారికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో మూడు బెర్తుల కోసం గట్టి ప్రయత్నాలే సాగుతున్నాయి. అధినేత ఆశీస్సుల కోసం అంతా ఆశావాహకంగా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో కీలకమైన హోం శాఖ మంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. ఆమె మూడుసార్లు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు స్థానం నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచిన తర్వాత జగన్ కోసం రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఫస్ట్ బ్యాచ్ ఎమ్మెల్యేలలో ఆమె ఒకరు. అందుకు ప్రతిఫలంగా ఆమెకు ప్రాధాన్యత దక్కింది. 2014లో ఓటమి పాలయినా 2019లో మూడోసారి సభలో అడుగుపెట్టిన ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా పాముల పుష్ప శ్రీవాణీకి అవకాశం వచ్చింది. ఆమె వరుసగా రెండుసార్లు విజయనగరం జిల్లా కురుపాం స్థానంలో గెలిచారు. ఎస్టీ రిజర్వుడు సీటు నుంచి ఆమె గెలిచి చిన్న వయసులోనే ఉపముఖ్యమంత్రి హోదా దక్కించుకోవడం విశేషం.

జగన్ తన క్యాబినెట్ లో తీసుకున్న మూడో మంత్రి తానేటి వనిత. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 2014లో ఓడిపోయినా, 2019లో గెలిచి టీడీపీకి గట్టిపట్టున్న కొవ్వూరు అసెంబ్లీ సీటు కైవసం చేసుకున్నారు. దాంతో ఆమెకి కూడా గుర్తింపు దక్కింది. ఇక ముగ్గురు మంత్రులలో ఇద్దరు ఎస్సీ నాయకులు కాగా, ఒకరు ఎస్టీ మహిళ. దాంతో కొత్తగా అవకాశం ఇచ్చే వారి విషయంలో కులం కోణం కూడా కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం అధికారపక్షంలో ఉన్న మహిళా నేతల్లో మరో 11 మంది అసెంబ్లీలో ఉన్నారు. వారిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కి పార్టీలో గుర్తింపు ఉంది. ఆమె సినీ గ్లామర్ తో రాష్ట్రమంతా ఫాలోయింగ్ ఉంది. అమెకు ఇప్పటికే ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదా దక్కింది. ఈసారి క్యాబినెట్ మీద గంపెడాశతో ఉన్నారు. అదే సమయంలో ఆమెకు జిల్లా నేతల్లో వ్యతిరేకత కూడా ఉన్న తరుణంలో ఛాన్స్ వస్తుందా రాదా అన్నది ఆసక్తికరం. ఆమెతో పాటుగా మరో సీనియర్ ఎమ్మెల్యే, ఎస్టీ రిజర్వుడు స్థానంలో గెలిచిన విశ్వసరాయి కళావతి కూడా ఆశావాహకంగా కనిపిస్తున్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చిలకలూరిపేటలో తొలిసారిగా గెలిచిన విడుదల రజనీ, పాతపట్నంలో గెలిచిన రెడ్డి శాంతి, కల్యాణదుర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉషశ్రీచరణ్, శింగనమల నుంచి ఎమ్మల్యేగా ఉన్న జొన్నలగడ్డ పద్మావతి, అమరావతి ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఆశావాహుల్లో ఉన్నారు వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

సీనియర్లకు ఈసారి అవకాశాలుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో విశ్వసరాయి కళావతి, ఆర్కే రోజా సీనియర్లుగా ఉన్నారు. అయితే కొత్తవారికి కూడా ఒకరిద్దరికి ఛాన్స్ ఉంటుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ తన పార్టీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కీలక పరిణామంగా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి