iDreamPost

కొత్త మంత్రులు ఎవరు?

కొత్త మంత్రులు ఎవరు?

మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు రాజ్యసభ సభ్యులుగా వెళ్లబోతున్నారు. అలా మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్రకు చెందిన ఇద్దరు మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారికి ఉద్వాసన తప్పదని వైఎస్సార్‌సీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే నాలుగైదు స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు మంత్రివర్గంలో ఎంట్రీపై ఆసక్తిగా ఉన్నారు. అలాగే గతంలో సీఎం వైఎస్‌ జగన్‌ హామీ పొందిన వారిలోనూ ఆశలు చిగురించాయి.

మొదటి మంత్రివర్గంలోనే తమకు అవకాశం వస్తుందని భావించిన వారిలో ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, ఆనం రాంనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కొలుసు పార్థసారధి, వరప్రసాదరావు, బూడి ముత్యాలనాయుడు, ముస్తఫా ముందు వరసలో ఉన్నారు. అలాగే సీఎం జగన్‌ హామీ పొందిన తిప్పల నాగిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్, మర్రి రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు. చిలకలూరిపేటలో తన స్థానాన్ని వదులుకున్న మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో మండలి రద్దు కాబోతోంది. దీంతో మర్రికి ఇతర మార్గాల్లో న్యాయం చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ హవా నడుస్తోంది కాబట్టి రెండు స్థానాల్లో బీసీలకే అవకాశం రావొచ్చు. ఇలా చూసుకుంటే కొలుసు పార్థసారథి ముందు వరుసలో ఉంటారు. ధర్మాన ప్రసాదరావు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మరో ముస్లిం మైనారిటీకి ఛాన్స్‌ ఇవ్వొచ్చు. గుంటూరుకు చెందిన ముస్తఫా మొదటి నుంచి పార్టీ విధేయునిగా ఉంటూ ఉన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా పార్టీ మారకుండా ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ఆందోళనల నేపథ్యంలో ముస్లిం మైనారిటీల్లో భరోసా నింపేందుకుగాను ముస్తఫాను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇతర మార్గాల్లో న్యాయం చేస్తున్నందున గాజువాకలో పవన్‌ ఓడించిన తిప్పల నాగిరెడ్డికి మంత్రి వర్గంలో ఛాన్స్‌ దొరుకుతుందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.

మరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మనసులో ఎవరు ఉన్నారో వేచి చూడాల్సిందే..!!!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి