iDreamPost

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ఏం జరగబోతోంది..?

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ఏం జరగబోతోంది..?

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు శాంతియుంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఇప్పటికి 9 సార్లు చర్చలు జరిగినా ఫలితం లేదు. చట్టాలు రద్దు చేయాలని రైతులు, అది తప్పా సవరణలు చేసేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం.. ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి రైతులు చలిలోనే ఉంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నా.. కేంద్రంలో మాత్రం మార్పు రానట్లుగా తాజాగా కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. నూతన చట్టాలను చాలా మంది రైతులు ఆమోదిస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వ్యాఖ్యానించగా.. చట్టాల వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొనడం రైతుల ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలుపుతోంది.

దూకుడు పెంచిన అన్నదాతలు..

కేంద్రం వైఖరి ఇలా ఉంటే.. రైతులు మాత్రం తమ డిమాండ్‌పై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ ఆందోళనను ఉదృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 26వ తేదీన జరగబోయే గణతంత్ర వేడుకల నేపథ్యంలో.. ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు ట్రాక్టర్లతో బయలుదేరారు. గణతంత్ర దినోత్సవం రోజున తమ ఆవేదనను, ఆందోళనను మరోసారి దేశానికి తెలియజేయాలనే లక్ష్యంతో అన్నదాతలు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల ఉద్యమానికి దేశ వ్యాప్తంగా మద్ధతు లభించింది. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు కూడా రైతులు నిర్వహించిన భారత్‌ బంద్‌లో పాల్గొన్నాయి.

కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి..

చట్టాల వల్ల అంతిమంగా నష్టపోయినా.. లాభపడినా.. అది రైతులే. తమకు ఈ చట్టాలు నష్టం చేస్తాయనే ఆందోళనను రైతులు భారీ స్థాయిలో వ్యక్తం చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మంకుపట్టుపడుతోందనే చర్చ దేశంలో జరుగుతోంది. రైతుల ఆందోళనలపై అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు స్పందించాయి. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరాయి. అయితే ఇది తమ అంతర్గత విషయమని.. ఇతర దేశాల జోక్యం తగదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సమస్యను పరిష్కరించే దశగా పని చేస్తున్నట్లు కనిపించడంలేదు. గణతంత్ర దినోత్సవం రోజున ఇతర దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా వస్తారు. వివిధ దేశాల రాయబారులు హాజరవుతారు. ఈ సమయంలో రైతులు లక్ష ట్రాక్టర్లతో నిర్వహించే ర్యాలీ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తుంది. దానిపై వివిధ దేశాలు ఆరా తీస్తాయి. దీని వల్ల దేశానికి, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో గణతంత్ర దినోత్సవానికి మరో 8 రోజులే ఉన్న నేపథ్యంలో.. ఈ లోపు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి