iDreamPost

Yash యష్ ముందున్న అతి పెద్ద సవాల్

Yash యష్ ముందున్న అతి పెద్ద సవాల్

కెజిఎఫ్ కు ముందు పక్క రాష్ట్రాలైన ఏపి తెలంగాణలో కనీస పరిచయం లేని కన్నడ హీరో యష్ కు ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చేసింది. పార్ట్ 2 సంచలనాలు ఇంకా పూర్తి కాలేదు. వసూళ్ల ఊచకోత కొనసాగుతోంది. ఏకంగా వెయ్యి కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇది నిజమైనా కాకపోయినా యష్ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయిన మాట వాస్తవం. ప్రభాస్ తో సమానంగా అని చెప్పడం తొందరపాటవుతుంది కానీ ఆర్ఆర్ఆర్ వల్ల జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంతైతే ఫాలోయింగ్ సంపాదించుకున్నారో అంతా యష్ కు దక్కిందన్న మాట వాస్తవం. అసలు సవాల్ ఇప్పుడు మొదలయ్యింది.

యష్ ఇంకా నెక్స్ట్ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఏది చేసినా కెజిఎఫ్ అంచనాల బరువుని మోసే రేంజ్ లో ఉండాలి. కానీ ఇదంత సులభం కాదు. చరిత్ర తవ్వి చూస్తే ఏ హీరోకైనా స్టార్ డం తీసుకొచ్చిన బ్లాక్ బస్టర్ చేశాక కెరీర్ లో గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయి. సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు తర్వాత ఏకంగా పన్నెండు ఫ్లాపులు చూశారు. నాగార్జున శివ పాత్ బ్రేకింగ్ మూవీగా పేరు తెచ్చుకున్నాక ఆ హ్యాంగోవర్ నుంచి అభిమానులను బయటికి తీసుకురావడానికి యువసామ్రాట్ కు మూడేళ్లు పట్టింది. మధ్యలో అన్నీ ఫ్లాపులే. చిరంజీవి ఖైదీ వచ్చాక ఈ కారణంగానే మంత్రి గారి వియ్యంకుడు లాంటి మంచి సినిమా కిల్ అయ్యింది.

సరే ఇవి పాత ఉదాహరణలు ఇప్పుడెందుకు అంటారా. బాహుబలితో ఇంటర్ నేషనల్ మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ కు సాహో ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూశాం. సరే నార్త్ లో హిట్ అయ్యింది కదాని సంతృప్తి పడితే రాధే శ్యామ్ మరీ దారుణంగా అందరూ తిరస్కరించారు. మగధీర తర్వాత రామ్ చరణ్ తన వయసుకు తగ్గట్టు ఆరంజ్ చేస్తే స్వంత బాబాయ్ నాగబాబు నష్టాలు తట్టుకోలేకపోయారు. సో యష్ నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా ఉండబోతోంది. ఈ ఒత్తిడి కారణంగానే ఎన్ని కథలు వచ్చినా ఎందరు దర్శకులు కలుస్తున్నా ఒక పట్టాన ఓకే చేయలేకపోతున్నాడట. మరి రాఖీ భాయ్ ని ఒప్పించే దర్శకుడు ఎవరో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి