iDreamPost

హిందీలోనూ వీరయ్య ,వారసుడు హంగామా

హిందీలోనూ వీరయ్య ,వారసుడు హంగామా

సంక్రాంతి సీజన్ ఈసారి టాలీవుడ్ కే కాదు బాలీవుడ్ కూ పాకుతోంది. ఈ జనవరిలో పఠాన్ కు ముందు చెప్పుకోదగ్గ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఏదీ లేకపోవడంతో వాల్తేరు వీరయ్యని డబ్బింగ్ చేసి జనవరి 13నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా డబ్బింగ్ ట్రైలర్ ని విడుదల చేశారు. అనువాదంలో జాగ్రత్త తీసుకోవడంలో మంచి క్వాలిటీ కనిపిస్తోంది. దీంతో పాటు వారసుడుని వరిసు టైటిల్ తోనే హిందీ వెర్షన్ అదే డేట్ కి అందిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. చిరు VS విజయ్ క్లాష్ అన్నమాట.

ఇటీవలి కాలంలో హిందీలో పెద్దగా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసిన సినిమాలు లేవు. దృశ్యం 2 ఒక్కటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. యాభై రోజుల వరకు స్టడీగా వసూళ్లు రాబట్టిన మూవీ ఇదొక్కటే. రణ్వీర్ సింగ్ సర్కస్ దారుణంగా బోల్తా కొట్టేసింది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య లాంటి ఎంటర్ టైనర్స్ కి మంచి అవకాశం ఉంటుంది. గాడ్ ఫాదర్ కూడా డబ్బింగ్ చేశారు కానీ మార్కెటింగ్ లోపం వల్ల పూర్తి స్థాయిలో ఆడియన్స్ కి రీచ్ కాలేదు. అయినా కూడా కలెక్షన్లు బాగానే వచ్చాయి. సైరా నరసింహారెడ్డి నుంచి చిరంజీవి తిరిగి హిందీ మార్కెట్ మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు.

ఇప్పుడు వాల్తేరు వీరయ్యని కనక సరిగా ప్రమోట్ చేసుకుంటే ఛాన్స్ కొట్టేసినట్టే. మరోవైపు వారసుడుని హిందీలోనూ విడుదల చేయాలని ఫిక్స్ అయిన రాజుగారు దానికి సంబంధించిన వ్యవహారాలను గోల్డ్ మైన్స్ సంస్థకు ఇచ్చారు. సౌత్ డబ్బింగులతో యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ తో పాపులర్ అయిన సంస్థ ఇది. పుష్ప 1 మార్కెటింగ్ చేసింది ఈ బ్యానరే. మెగా మూవీ బాధ్యతను బి4యు తీసుకుంది. పోటాపోటీగా విడుదల ఉంటుంది. స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీస్ మరో రెండున్నాయి కానీ వాటికి కనీస బజ్ లేకపోవడం చిరు విజయ్ లకు కలిసి వచ్చేలా ఉంది. హిట్ టాక్ వస్తే పండగే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి