iDreamPost

విజయనగరం రైలు ప్రమాదం.. ఆ చిన్నతప్పు వల్లే ఇలా జరిగిందా?

  • Published Oct 30, 2023 | 8:26 AMUpdated Oct 30, 2023 | 10:51 AM

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఒక చిన్న తప్పిదం అంటున్నారు. ఆ వివరాలు..

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఒక చిన్న తప్పిదం అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Oct 30, 2023 | 8:26 AMUpdated Oct 30, 2023 | 10:51 AM
విజయనగరం రైలు ప్రమాదం.. ఆ చిన్నతప్పు వల్లే ఇలా జరిగిందా?

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్తవలస మండలం, అలమండ- కంటకాపల్లి స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రెండు ప్యాసింజర్ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జు నుజ్జు కాగా.. సుమారు 14 మంది వరకు మృతి చెందారు. 33 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. విశాఖ నుంచి విజయనగరంవైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస(08532) రైలును.. విశాఖపట్నం-రాయగడ (08504) రైలు వెనక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో ప్రయాణం ప్రారంభించాయి. అయితే ఓ చిన్న తప్పిదం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని సమాచారం.

విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. సరిగా అదే ట్రాక్‌పై దాని వెనకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్‌ 6 గంటలకు బయలుదేరింది. నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్‌ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందంటున్నారు ప్యాసింజర్లు.

ఈలోగా వెనుకనుంచి వచ్చిన రాయగడ రైలు.. పలాస ట్రైన్‌ను ఢీకొన్నట్లు చెబుతున్నారు. ఒకే ట్రాక్‌లో సిగ్నల్‌ క్రాస్‌ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. సిగ్నలింగ్‌ విషయంలో ఏర్పడిన గందరగోళం కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అంటున్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుంది.

ప్రస్తుతం అధికారులు ఒక రైలు ఆగి ఉన్నప్పుడు.. అదే ట్రాక్‌పై మరో రైలు వెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు.ఆటో సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపం వల్లే.. పలాస ట్రైన్‌ వెనుక వస్తున్న రాయగడ రైలు.. మధ్య లైన్‌లోకి వచ్చినట్లు భావిస్తున్నారు. హైటెన్షన్‌ వైర్లు తెగిపడటంవల్ల ఘటన జరిగితే.. ఆ సమా­చారం కూడా వెనుక వస్తున్న రైళ్లకు చేర వేయాల్సి ఉంది. ఈ రెండూ జరగకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ లోప­మా.. మానవ తప్పిదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం-కొత్తవలస హైవేకు  5 కి.మీ దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నుజ్జుయిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి కట్టర్లు ఉపయోగిస్తున్నారు. బాధితులకు సాయం చేయడానికి హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు అధికారులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి