iDreamPost

విశాఖే పక్కా … – జగన్

విశాఖే పక్కా … – జగన్

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక “ది హిందూ” ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్నఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ని ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి, ఆ సమావేశంలో ఇంగ్లిష్ మీడియం విద్యపై కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థికి తన జీవితంలో ఇంగ్లిష్ ఒక తప్పనిసరి భాగమైందన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లిష్ తప్పని సరి అని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం పేద విద్యార్థులకు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు ప్రతిభ ఉండి కూడా వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాము పేద విద్యార్థుల తల్లితండ్రుల కోరిక మేరకే ప్రభుత్వం ద్వారా ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంగ్లిష్ మీడియం అందిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో అన్ని అవాంతరాలని అధిగమిస్తామన్నారు.

ఒకటో తరగతి నుండి ఆరవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే కాక ప్రయివేట్ పాఠశాలల్లో కూడా తెలుగుని కంపల్సరీ సబ్జెక్ట్ గా కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొదట్లో ఉత్పన్నమయ్యే సాధకబాధకాలు తనకి తెలుసని, ప్రాధమికంగా వచ్చే సమస్యలను తాము గుర్తించామని, దానికి తగ్గట్టు విద్యాబోధన, విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ లలో శిక్షణ ఇచ్చే దగ్గర నుండి టీచర్ ట్రైనింగ్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్ఫష్టం చేశారు.

Read Also: నిర్ణయం లేటు కావొచ్చు కానీ… తరలించడం మాత్రం ఖాయం..

ఇదే సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి రాజదాని అంశం మీద మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం అమరావతిని నిర్మించాలంటే లక్షా తొమ్మిదివేల కోట్లు కావాలని, ఈ పరిస్థితుల్లో అంత ఖర్చుపెట్టె పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదని తెలిపారు. అదేసమయంలో అమరావతికి పెట్టె ఖర్చులో కేవలం ఒక పది శాతం డబ్బులు విశాఖపట్నంలో పెడితే రాబోయే పదేళ్లలో విశాఖపట్నం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకి గట్టి పోటీ ఇస్తుందని మరోసారి పునరుద్ఘాటించారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగుతుందని, కార్యనిర్వాహక రాజధానిగా మారాబోయే విశాఖపట్నం లో సెక్రటేరియట్ తో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, శాఖాధిపతులు పరిపాలన కొనసాగిస్తారని, జుడీషియరి క్యాపిటల్ గా కర్నూల్ కొనసాగుతుంది తెలిపారు.

సరిగ్గా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు 50వ రోజుకు చేరడం , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమానికి అన్ని తానై ముందుకు నడిపించడం, ఇదే సమయంలో అమరావతిలోని రాజదానిని కొనసా గించాలంటూ కేంద్ర ప్రభుత్వం మీద, రాజ్యాంగ వ్యవస్థలమీద, కోర్టులలో వ్యాజ్యాలు వేయడం ద్వారా ఇలా అందుబాటులో అన్ని మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూ, ముఖ్యమంత్రి తీసుకున్న అధికార వికేంధ్రీకరణ నిర్ణయానికి శతవిధాలా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ముఖమంత్రి మేధావులు, పత్రికా ప్రముఖుల సమక్షంలోనే మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తుంది. దీనిని బట్టి రాజధాని విషయంలో, అధికార వికేంధ్రీకరణ విషయంలో జగన్ ఎంత పట్టుదలతో ఉన్నాడో అర్ధమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి