iDreamPost

Vijetha : కుటుంబం కోసం కిడ్నీ త్యాగం – Nostalgia

Vijetha : కుటుంబం కోసం కిడ్నీ త్యాగం – Nostalgia

స్టార్ హీరోలతో సెంటిమెంట్ సినిమాలు వర్కౌట్ కావేమో అనుకుంటాం కానీ సరిగా ప్లాన్ చేసుంటే క్లాస్ మాస్ ఆదరిస్తారని చెప్పడానికి ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి విజేత. 1985 ఫిబ్రవరిలో అనిల్ కపూర్ హీరోగా ‘సాహెబ్’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. అనిల్ గంగూలీ దర్శకులు. బెంగాలీలో వచ్చిన విజయవంతమైన చిత్రానికి ఇది రీమేక్. దీన్ని తెలుగు రీమేక్ చేసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు నిర్మాత అల్లు అరవింద్. అప్పటికే చిరంజీవికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఖైదీతో మొదలుపెట్టి అడవిదొంగ దాకా బిగ్ క్రౌడ్ పుల్లర్ గా మారారు. ఆ టైంలో సాహెబ్ లాంటి భావొద్వేగాలు ఎక్కువ ఉన్న పాత్ర చిరుతో చేయిస్తే రిస్క్ అవుతుందేమో అనుకున్నారు కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం దర్శకుడు ఏ కోదండరామిరెడ్డిది.

చిరంజీవి సైతం శుభలేఖ తర్వాత అలాంటి ఫీడ్ గుడ్ మూవీ చేయలేదనే ఉద్దేశంతో దీనికి ఓకే చెప్పారు. ఒరిజినల్ వెర్షన్ లో లేని కొన్ని మార్పులను పాటలను విజేతలో జోడించారు. జంధ్యాల సంభాషణలు సమకూర్చగా చక్రవర్తి మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ సిద్ధం చేశారు. మంచి పాటలు కంపోజ్ అయ్యాయి. భానుప్రియ హీరోయిన్ కాగా హీరో ఫ్యామిలీ సభ్యులుగా జెవి సోమయాజులు, శారద, నూతన్ ప్రసాద్, గిరిబాబు, కె విజయ, శుభ, శ్రీలక్ష్మి తదితరులు ఎంపికయ్యారు. డాక్టర్ పాత్రకు జగ్గయ్య, మరో కీలకమైన క్యారెక్టర్ సత్యనారాయణ దక్కించుకున్నారు. అల్లు అర్జున్ తో అతనితో పాటు అన్నయ్య అల్లు వెంకటేష్ ఇందులో చిన్నపిల్లలుగా నటించారు.

విజేతకు ముందు చాలా టైటిల్స్ అనుకున్నారు కానీ ఫైనల్ గా ఒక సినిమా మ్యాగజైన్ లో పెట్టిన పోటీ ద్వారా ఆడియన్స్ ఓటేసిన దానికే ఫిక్స్ అయ్యారు. ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఓ యువకుడు కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉంటే చెల్లి పెళ్లి కోసం తన కిడ్నీ సైతం అమ్మేస్తాడు. అప్పటిదాకా అపార్థం చేసుకున్న అన్నయ్యలు వదినలు తండ్రి నిజం తెలుసుకున్నాక కన్నీరు పెట్టుకుంటారు. బాధ్యత లేదని తిట్టిపోసిన వాడే ఇంత త్యాగం చేయడం చూసి ప్రేక్షకులు కదిలిపోయారు. 1985 అక్టోబర్ 23న విజేత విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్ లో బెస్ట్ ఎమోషనల్ డ్రామాగా నిలిచిపోయింది. క్లాస్ ఆడియన్స్ ని చిరుకి మరింత చేరువ చేసింది

Also Read : Kathanayakudu : NTR సూపర్ హిట్ పేరుతో బాలయ్య – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి