iDreamPost

బాబుపై మరో 7 కేసులు పెండింగ్! అన్నీ బయటకు తీస్తాం: విజయ సాయిరెడ్డి

బాబుపై మరో 7 కేసులు పెండింగ్!  అన్నీ బయటకు తీస్తాం: విజయ సాయిరెడ్డి

చంద్రబాబు అరెస్టు, ఆయన భవిష్యత్ పై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు ఎవరైనా ఒకటే అని వ్యాఖ్యానించారు. తాను చట్టం నుంచి తప్పించుకోగలను అనుకున్న చంద్రబాబు భ్రమలు వీడిపోయాయంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని అక్రమాలు, అవినీతి పనులు చేసినా.. స్టేల ద్వారా తప్పించుకోవచ్చని చంద్రబాబు ఇన్నాళ్లు భావించారన్నారు. చంద్రబాబు తప్పకుండా 10 ఏళ్లు జైలు జీవితం గడుపుతారని చెప్పారు. ఈ ఒక్క కేసు మాత్రమే కాకుండా.. పెండింగ్ కేసులు మొత్తం బయటకు తీస్తామన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టు అవ్వడంపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “చట్టానికి ఎవరూ అతీతులు కారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే పరిపాలన చేయాల్సి ఉంటుంది. ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాలి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దోషిగా తేలితే.. దాదాపు 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీ ముగిసిన తర్వాత.. పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ ఒక్క కేసే కాదు.. చంద్రబాబుపై ఇంకా 6, 7 ట్రయలబుల్ కేసులు ఉన్నాయి. అన్నింటిని బయటకు తీస్తాం. ఖజానాకు సంబంధించిన సంపద దోచుకుని.. ఎలా విదేశాలకు తరలించారన్న దానిపై విచరాణ చేయడమే కాకుండా.. ఆ డబ్బును తిరిగి రాష్ట్ర ఖజానాకు జమ చేసేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపడతారు. రాష్ట్ర సంపదను దోచుకున్నారని అరెస్టు చేస్తే.. దానిని రాజకీయ కక్ష అంటూ కొందరు చెబుతున్నారు. మాది రాజకీయ కక్షే అయిచే చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చేది. ఎఫ్ఐఆర్ నమోదై.. అరెస్టు జరిగితే తర్వాతి వ్యవహారం మొత్తం కోర్టు పరిధిలోకి వెళ్తుంది” అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డి కామెంట్స్ తో తెలుగుదేశం వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ చేసేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతోంది అని చెబుతున్నారు. మిగిలిన కేసుల్లో కూడా వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబుని ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్ట్ కూడా వైరల్ అవుతోంది. 2023 సంవత్సరం చంద్రబాబుకు చివరి సంవత్సరం అవుతుందని విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఆ పోస్టులో “చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. చంద్రబాబు గారూ…మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్థం అయ్యుంటుంది మీకు” అంటూ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి