iDreamPost

ఏపీలో తాజా రాజకీయం.. రీల్‌ వీడియో.. రియల్‌ వీడియో..

ఏపీలో తాజా రాజకీయం.. రీల్‌ వీడియో.. రియల్‌ వీడియో..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల విమర్శలు మాటలు దాటి చిత్రాలకు మళ్లాయి. చెబితే చాలదనీ వీడియోల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా బలంగా వివరిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీలు అనుసరిస్తున్న ఈ సరికొత్త రాజకీయానికి మీడియా, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ముగ్ధులవుతున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ సర్కార్‌ అనుచరిస్తున్న మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలపై ప్రతిపక్ష టీడీపీ కత్తులు నూరుతోంది. తమ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఒకే రాజధాని కావాలని ప్రజలకు, మండలి రద్దు జరిగినా నష్టం లేదని పార్టీ ఎమ్మెల్సీలకు సవివరంగా చెప్పేందుకు వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది.

Read Also: పార్టీల్లో ఉన్న స్వతంత్ర సమరయోధులకు ఫించన్ ఇవ్వాల్సిందే…

మాటల రూపంలో కాకుండా దృశ్య రూపంలో చూపించడం వల్ల తాము అనుకున్న విషయం బలంగా చెప్పవచ్చనున్న భావనతో ఇరు పార్టీలు ఉన్నాయి. అందుకే వీడియో రాజకీయానికి తెరతీశాయి. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనను.. తుగ్లక్‌తో పోలుస్తూ.. నిన్న జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ‘‘ మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌’’ సినిమాను టీడీపీ ప్రదర్శించింది. ఇక తమ పార్టీ ఎమ్మెల్సీల్లో భరోసా నింపేందుకు… మండలి రద్దుపై వైఎస్‌ జగన్‌ అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించేందుకు మరో చిత్రాన్ని ఎంచుకుంది. ‘‘ హించించే 23వ రాజు పులకేశి’’ చిత్రాన్ని ఆ సమావేశంలో ప్రదర్శించింది.

Read Also: కౌన్సిల్‌ క్యాన్సిల్‌.. దారితీసిన పరిణామాలు… చంద్రబాబు చక్రం తిప్పుతారా..?

టీడీపీ ‘రీల్‌ (సినిమా) వీడియో’లను ప్రదర్శిస్తుంటే.. అధికారపార్టీ వైఎస్సార్‌సీపీ ‘రియల్‌ వీడియో’లను ప్రదర్శిస్తోంది. మండలి రద్దును సమర్థించుకునేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చంద్రబాబు పూర్వ ప్రసంగాలనే ఆయుధంగా వాడుకుంటోంది. 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి మండలి పునర్ధురణకు సిద్ధపడగా.. దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. ఆ వీడియోలను ప్రస్తుత వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఉపయోగించుకుంటోంది. చంద్రబాబు నాటి వీడియోలను ఈ రోజు సోమవారం అసెంబ్లీలో మండలి రద్దుపై జరిగిన చర్చ సందర్భంగా ప్రదర్శించింది. టీడీపీ రీల్‌ వీడియోలకు ధీటుగా వైఎస్సార్‌సీపీ రియల్‌ వీడియోలను ప్రదర్శిస్తూ తిప్పికొడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో మున్ముందు కూడా కొనసాగి ప్రజలను రంజింపజేసే అవకాశం ఉందని వారు చమత్కరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి