iDreamPost

నాగార్జున బర్త్ డే.. ఈ మూవీ శివ కన్నా చాలా స్పెషల్!

నాగార్జున బర్త్ డే.. ఈ మూవీ శివ కన్నా చాలా స్పెషల్!

మాములుగా కమర్షియల్ సినిమాల్లో హీరో ఊరికే విలన్ మీద తిరగబడడు. తనకో కుటుంబానికో లేక సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడో అతనిలోని కథానాయకుడు బయటికి వచ్చి దుర్మార్గుల అంతం చూస్తాడు. ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఫార్ములానే. ముఖ్యంగా అడవిరాముడు టైం నుంచి వీటి తాకిడి ఎక్కువయ్యింది. దాదాపు అందరు హీరోలకు ఈ సూత్రం సంజీవినిలా పని చేసి వాళ్ళను మాస్ కు మరింత దగ్గర చేసింది. నాగార్జునకు అలా ఉపయోగపడిన సినిమా విక్కీ దాదా. 1986లో విక్రమ్ తో లాంచ్ అయ్యాక యువసామ్రాట్ కు కిరాయిదాదా, మజ్ను, కలెక్టర్ గారి అబ్బాయి లాంటి బాక్సాఫీస్ సక్సెస్ లు నాలుగైదు దక్కాయి.

ఆ టైంలో నవలల ట్రెండ్ ఉధృతంగా నడుస్తోంది. నాగార్జున సైతం ఆఖరి పోరాటం రూపంలో మంచి విజయం నమోదు చేసుకున్నాడు. రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అప్పట్లో పుస్తకాలుగా రాయని కథలను నిర్మాతలకు ఇచ్చేవారు. ఆలా తయారు చేసిందే విక్కీ దాదా. నాగ్ కు స్వంత బ్యానర్ లాంటి కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో డి శివప్రసాద్ రెడ్డి దీన్ని నిర్మించారు. స్క్రీన్ ప్లే మాత్రమే పరుచూరి సోదరులు సమకూర్చగా గణేష్ పాత్రో సంభాషణలు రాశారు. బాలీవుడ్ ఫేమ్ జుహీ చావ్లా హీరోయిన్ గా కన్నడ ప్రభాకర్, గొల్లపూడి, సుధాకర్, గిరిబాబు, రంగనాథ్, కోట, శ్రీవిద్య, వరలక్ష్మి, వినోద్ తదితరులు ఇతర తారాగణంగా నటించారు

అమ్మా చెల్లితో ఆనందంగా గడుపుతున్న లాయర్ విక్రమ్(నాగార్జున)జీవితం మాఫియా డాన్ ప్రభాకర్(కన్నడ ప్రభాకర్)వల్ల ఊహించని కుదుపులకు గురవుతుంది. జర్నలిస్ట్ చెల్లి(వరలక్ష్మి)ని పోగొట్టుకుంటాడు. న్యాయం అమ్ముడుపోయే వ్యవస్థలో శత్రువులకు శిక్ష పడదని గుర్తించి నల్లకోటు వదిలేసి విక్కీ దాదాగా కొత్త అవతారం ఎత్తుతాడు. సాక్షాలు దొరక్కుండా ఒక్కొక్కరిని తెలివిగా మట్టుబెడతాడు. కథలో మరీ కొత్తదనం లేకపోయినా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్, హుషారైన పాటలు, మంచి క్యాస్టింగ్ 1989 మార్చి 11 విడుదలైన విక్కీ దాదాను సూపర్ హిట్ చేశాయి. శివకు ముందే మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ఫాలోయింగ్ వచ్చేసింది.

Also Read : బంగారు బుల్లోడుతో నిప్పురవ్వ ఢీ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి