iDreamPost

హత్య కేసులో ఇరుక్కున్న వ్యక్తి.. తన కేసును తానే వాదించుకోవడం కోసం లా చదివి

  • Published Dec 10, 2023 | 5:21 PMUpdated Dec 10, 2023 | 5:21 PM

ఓ యువకుడు తప్పుడు కేసులో ఇరుకున్నాడు. తనకు తాను న్యాయం చేసుకోవడం కోసం ఏకంగా లాయర్ గా మారి.. విజయం సాధించాడు. ఆ వివరాలు..

ఓ యువకుడు తప్పుడు కేసులో ఇరుకున్నాడు. తనకు తాను న్యాయం చేసుకోవడం కోసం ఏకంగా లాయర్ గా మారి.. విజయం సాధించాడు. ఆ వివరాలు..

  • Published Dec 10, 2023 | 5:21 PMUpdated Dec 10, 2023 | 5:21 PM
హత్య కేసులో ఇరుక్కున్న వ్యక్తి.. తన కేసును తానే వాదించుకోవడం కోసం లా చదివి

వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు.. కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదనే సిద్ధాంతాన్ని భారతీయ న్యాయ వ్యవస్థ పాటిస్తుంది. మన దగ్గర న్యాయం జరగడం కాస్త ఆలస్యం కావొచ్చేమో.. కానీ అన్యాయం మాత్రం జరగదు అంటారు జ్యూడిషియరీ నిపుణులు. న్యాయం ఆలస్యమైనా.. చివరికి గెలుస్తుందని నిరూపించిన సంఘటనలు అనేకం మన దేశంలో చోటు చేసుకున్నాయి. తమకో లేదా తమ వారికో న్యాయం చేయడం కోసం లాయర్ గా మారిన వాళ్లు కూడా ఉన్నారు. గతంలో ఓ వ్యక్తి తల్లికి న్యాయం చేయడం కోసం పట్టుబట్టి లాయర్ గా మారి.. అమ్మను గెలిపించిన వార్త చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన మరో వార్త వెలుగు చూసింది. తనకు తాను న్యాయం చేసుకోవడం కోసం ఓ వ్యక్తి.. లాయర్ గా మారడమే కాక విజయం కూడా సాధించాడు. ఆ వివరాలు..

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 12 ఏళ్ల క్రితం అనగా 2011లో మీరట్ లో ఇద్దరు కానిస్టేబుల్స్ దారుణ హత్యకు గురి కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసు సిబ్బందే హత్యకు గురి కావడంతో.. ఈ ఘటనపై నాటి ముఖ్యమంత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దాంతో నాడు ఈ కేసులో పోలీసులు మొత్తం 17 మందిని నిందితులగా చేర్చగా.. వారిలో 18 సంవత్సరాల అమిత్ చౌదరీ అనే యువకుడు కూడా ఉన్నాడు. వారిపై అనేక కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

సైన్యంలో చేరాలనుకుని.. చివరకు..

బాగ్‌పత్‌లోని కిర్తల్ గ్రామానికి చెందిన ఒక రైతు కుమారుడైన అమిత్ చౌదరి సైన్యంలో చేరాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు.. కానిస్టేబుళ్ల హత్య కేసులో ఇరుక్కున్నాడు. అయితే ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య వెనుక కైల్ అనే క్రిమినల్ ముఠా హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ ముఠాలోనే అమిత్ చౌదరి భాగమని భావించిన పోలీసులు అతడిని జైలుకు తరలించారు.

అలా హత్య కేసులో అరెస్టైన అమిత్.. 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అయితే ముందు నుంచి కూడా తాను నిర్దోషిని అని మొర పెట్టుకుంటూనే ఉన్నాడు అమిత్. కానీ అతడి వాదనను ఎవరూ పట్టించుకోలేదు. అలా 2 ఏళ్ల జైలు శిక్ష తర్వాత 2013 లో బెయిల్‌పై విడుదలైన అమిత్ చౌదరి.. తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం లా చదవాలని నిర్ణయించుకున్నాడు.

లా చదవాలని నిర్ణయం..

ఈ క్రమంలోనే బీఏ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎమ్ సహా పలు లా కోర్సులను చేశాడు అమిత్. ఆఖరికి బార్ కౌన్సిల్ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించి న్యాయవాద పట్టాను అందుకున్నాడు. అయితే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను చంపిన కేసులో ఎలాంటి సాక్షులు, వాంగ్మూలాలు లేకుండా నత్త నడకన సాగింది ఈ కేసు. ఇలా ఉండగానే న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో చేరడానికి అన్ని అకడమిక్ అర్హతలు పూర్తి చేశాడు అమిత్ చౌదరీ. ఈ క్రమంలోనే ఆ కేసు కోర్టు విచారణ సందర్భంగా.. అమిత్ చౌదరి నిందితుల తరఫున వాదించారు. ఈ కేసులో అమిత్ తో సహా 13 మంది వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది.

అంతేకాక కానిస్టుబుల్స్ హత్య కేసులో అసలైన నిందితులైన సుమిత్ కైల్, నీతూ, ధర్మేంద్రలను దోషులుగా గుర్తించారు. అయితే 2013 లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుమిత్ కైల్ హత్యకు గురయ్యాడు. కానిస్టేబుల్‌లను చంపి వారి తుపాకీలను తీసుకున్నందుకు నీతుకు జీవిత ఖైదుతోపాటు రూ. 20 వేల జరిమానా కోర్టు విధించింది. తీర్పుకు ముందే ధర్మేంద్ర క్యాన్సర్‌తో మరణించాడు.

నిర్దోషిగా ప్రకటిస్తూ.. తీర్పు వెల్లడైన తర్వాత.. అమిత్ చౌదరి మాట్లాడుతూ.. నేను భారత సైన్యంలో చేరాలనుకున్నాను. అందుకు ప్రిపేర్ అవుతుండగానే.. ఇలా 2011 లో అక్రమ కేసులో ఇరుకున్నాను. అలా నా జీవితమే మారిపోయింది. అయినప్పటికీ ఈ కేసు కారణంగా నేను లా కోర్సు పూర్తి చేశాను. ప్రస్తుతం క్రిమినల్ జస్టిస్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను అని వివరించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి