iDreamPost

ఇక యుద్దమేనా..?

ఇక యుద్దమేనా..?

ప్రపంచం మరో యుద్దానికి చేరువవుతొందా..? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది..! ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికా డ్రోన్‌ క్షిపణి దాడిలో ఇరాన్‌ అత్యున్నత సైనికాధికారి, అల్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ సులేమానీ మరణించింది మొదలు ప్రపంచాన్ని యుద్ధమేఘాలను కమ్ముకున్నాయి. తాజాగా అమెరికా చర్యలకు ప్రతిగా ఇరాన్ సైతం దాడులకు తెగబడటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి ఇరాన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే కనీ వినీ రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

పశ్చిమాసియా యుద్ధం అంచుకు చేరువవుతోంది. ఇరాన్‌ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని డొనాల్ట్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌లో 52 కీలక వ్యూహాత్మక, పర్యాటక, సాంస్కృతిక ప్రాంతాలను గుర్తించామని, ఇంకోసారి ఇరాన్ తమపై దాడిచేస్తే ఆ ప్రాంతాలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా చాలా రోజుల కిందట 52 మంది అమెరికన్లను ఇరాన్‌ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్య ఉండటం గమనార్హం.

‘వారు మాపై దాడి చేశారు. మేం ప్రతీకార దాడులు చేశాం. వారు మళ్లీ దాడి చేస్తే.. మా ప్రతీకారం మరింత తీవ్రంగా ఉంటుంది’ అని ట్రంప్‌ తీవ్ర పదజాలంతో ట్వీట్‌ చేశారు. ‘మిలటరీ సంపత్తి కోసం ఇటీవలే 2 ట్రిలియన్‌(2 లక్షల కోట్ల) డాలర్లను ఖర్చు చేశాం. ప్రపంచంలోనే మాది అతిపెద్ద సైనిక శక్తి. మా స్థావరాలపై కానీ, పౌరులపైకానీ దాడి చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా ప్రతీకార దాడులుంటాయి’ అని ట్రంప్ ట్వీట్ లో స్పష్టం చేశారు.

మరో వైపు ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ సైతం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ను హిట్లర్, సూటు వేసుకున్న ఐసిస్ ఉగ్రవాదిగా అభివర్ణించింది. పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. ఇది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జవాద్‌ జారిఫ్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని, అదే జరిగితే ట్విన్ టవర్లు కూలినట్టు ఆ దేశం కూలిపోతుందని ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ అబ్దుల్‌ రహీం మౌసావి వ్యాఖ్యానించారు. పైగా వీటో దేశాలతో కుదుర్చుకున్న అణుఒప్పందం ఇకెంతమాత్రం ఉనికిలో లేదని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు పేర్కొనడం పరిస్థితులను చేయిదాటేలా చేస్తోంది.

ఇదిలా ఉండగా తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్‌ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనిపైనా స్పందించిన ట్రంప్ ఇరాక్ పై తీవ్ర ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం ఆఫ్రికాకు విస్తరించింది. ఆదివారం కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్‌ షబాబ్‌ తీవ్రవాద సంస్థ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక అమెరికా సర్వీస్ మెన్ తోపాటు ఇద్దరు కాంట్రాక్టర్లు మరణించారు. దాడికి సంబంధించి నలుగురిని హతమార్చినట్లు కెన్యా దళాలు తెలిపాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి