iDreamPost

1945లో అమెరికా మీద జీవాయుధ యుద్ధం ప్లాన్ చేసిన జపాన్

1945లో అమెరికా మీద జీవాయుధ యుద్ధం ప్లాన్ చేసిన జపాన్

ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ చైనా లేబొరేటరీ నుంచి వచ్చిందని, ఇలాంటి ఎన్నో ప్రాణాంతక సూక్ష్మజీవులు చైనా దగ్గర ఉన్నాయని, జీవాయుధ యుద్ధంలో వాటిని ఆయుధాలుగా మార్చి వాడుకోవడం చైనా పాలకుల ప్రణాళిక అని అమెరికా అధ్యక్షుడు ట్రంపుతో సహా చాలామంది ఆరోపిస్తున్నారు.

1925లో చేసిన జెనీవా ఒప్పందం రసాయన, జీవ ఆయుధాల ఉత్పత్తి వినియోగం మీద నిషేధం విధించినా చాలా చిన్నా పెద్ద దేశాలు ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి, అలాంటి ప్రమాదకర ఆయుధాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి ఒక ఉదాహరణే 1945లో అమెరికా మీద ప్లేగు బాక్టీరియాతో దాడి చేయాలని జపాన్ వేసిన ప్రణాళిక.

ప్రయోగశాల

1930 దశకం ఆరంభం నుంచి చైనా మీద దాడులు జరిపిన జపాన్ తూర్పు, మధ్య చైనాలో అధిక భాగాన్ని ఆక్రమించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే జపాన్ సైనికాధికారులు తమ దృష్టిని జీవ, రసాయన ఆయుధాల అభివృద్ధి మీద పెట్టారు. ఇందుకోసం చైనాలోని మంచూరీయా ప్రాంతంలో హార్డిన్ అనే చోట యూనిట్ 731 పేరుతో ఒక పెద్ద ప్రయోగశాలల సమూహాన్ని నిర్మించారు. షింజో ఇషియో అనే సైనికాధికారి నాయకత్వంలో ఇక్కడ చైనీయులమీద వినడానికే వొళ్ళు గగుర్పొడిచే ప్రయోగాలు ఎన్నో జరిపారు.

ఇక్కడ అభివృద్ధి చేసిన ఆయుధాలలో ప్లేగు కలిగించే బాక్టీరియాని నింపిన కీటకాలతో నిండిన బాంబులు ఒకటి. ఇవి పనిచేస్తాయో లేదో అని చైనా గ్రామాల్లో ప్రయోగించి చూశారు. రాత్రి వేళల్లో ఈ బాంబులు చైనా గ్రామాల మీద వదిలి, ఆ ప్రాంతాలలో ఎంతమంది ప్లేగ్ బారిన పడ్డారో పరిశీలించారు.

ఆపరేషన్ చెర్రీ బ్లాసమ్

తమ ప్రయోగాలతో సంతృప్తి చెందాక, ప్లేగు బాక్టీరియాతో అమెరికా మీద దాడి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు సైనికాధికారులు. విమానంలో వెళ్లి అమెరికా పశ్చిమ తీరంలో బాక్టీరియా నింపిన కీటకాలతో కూడిన బాంబులు జారవిడవాలన్నది ప్లాన్. అమెరికా తీరం దాటిన విమానాలు తిరిగివచ్చే అవకాశం లేదు కాబట్టి, బాంబులు జారవిడిచాక, అమెరికా దళాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకులు కూల్చేయకపోతే ఏదో ఒక నగరంలో భవనాలు ఉన్నచోట కూల్చేసి, మరింత నష్టం కలగజేయాలన్న ఆత్మాహుతి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. కమికాజ్ అన్న ఈ పద్ధతిలో యుద్ధం చివరిరోజుల్లో జపాన్ పరాజయం దాదాపు ఖాయం అయ్యాక చాలా మంది యుద్ధ విమానాల పైలట్లు అమెరికా యుద్ధ నౌకలని ధ్వంసం చేశారు.

ఆపరేషన్ చెర్రీ బ్లాసమ్ అని పేరు పెట్టి, సెప్టెంబర్ 22,1945 ముహూర్తం నిర్ణయించి, ప్రతిపాదనలు పంపితే, అవి సైనికాధికారి హిడేకి టోజో వద్దకు చేరాయి. అప్పటికే జపాన్ పరాజయం బాటలో ఉంది. ప్రజలకు మాత్రం విజయం అంచుల్లో ఉన్నామని వార్తలు అందజేస్తున్నా వాస్తవ పరిస్థితి ఉన్నతాధికారులకు బాగా తెలుసు. అదీగాక అమెరికా ఒక శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేస్తున్న విషయం కూడా వారికి చూచాయగా తెలిసింది.

ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న టోజో ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. జీవాయుధ ప్రయోగం జరిపినట్లయితే అమెరికా చేయబోయే ప్రతీకార దాడులు చాలా తీవ్రంగా, జపాన్ దీవులన్నీ తుడిచిపెట్టే స్థాయిలో ఉంటాయేమోనని భయపడ్డ టోజో ఈ దాడి ప్రతిపాదనకు అడ్డుకట్ట వేశాడు.

యుద్ధం అనంతరం

యుద్ధంలో జపాన్ ఓడిపోయాక ఆ దేశ సైన్యం జరిపిన అకృత్యాలన్నీ బయటకు వచ్చాయి. భయంకరమైన ప్రయోగాలు జరిపీంచిన షిరో ఇషియో తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం అందిస్తానని అమెరికాతో ఒప్పందం చేసుకుని ఏ శిక్ష లేకుండా బయట పడడమే కాకుండా, ఆ తర్వాత కేన్సర్ తో మరణించే వరకూ ఉన్నత పదవులు అనుభవించాడు. ఆపరేషన్ చెర్రీ బ్లాసమ్ ని అడ్డుకున్న హిడేకి టోజోను విచారణ జరిపి, యుద్ధం ముగిసిన మూడు సంవత్సరాలకి ఉరి తీశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి