iDreamPost

ఇదేంటి బాసూ.. నీకు ఎదురిచ్చి వెళుతున్నారా ? ఏంటి?

ఇదేంటి బాసూ..  నీకు ఎదురిచ్చి వెళుతున్నారా ? ఏంటి?

ఇతర భాషల నుంచి వ్యాపార పరంగా ఎలాంటి మంచి విషయాలు చూసినా వెంటనే వాటిని అడాప్ట్ చేసుకోవడం తెలుగు దర్శక నిర్మాతల శైలి. కానీ బిగ్ బాస్ షో విషయంలో మాత్రం ఎండిమోల్ అనే సంస్థ రంగంలోకి దిగి హిందీ బిగ్ బాస్ పోలి ఉన్నట్లుగానే తెలుగు బిగ్ బాస్ షో ని కూడా రూపకల్పన చేసింది . ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ సీజన్ కూడా నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు నాలుగు సీజన్లలో హోస్ట్ చేసిన నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ ప్రారంభం కాగా ఇప్పుడు ఈ షో గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. సాధారణంగా ఈ బిగ్ బాస్ అనేది ఒక డచ్ టీవీ సిరీస్ బిగ్ బ్రదర్ అనే దానిని చూసి ఇన్స్పైర్ అయ్యి ముందు హిందీలో ప్రారంభించారు. డచ్ సిరీస్ ను నిర్మించిన ఎండిమోల్ రంగంలోకి దిగడంతో అక్కడ అనేక సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి.

దీంతో దానిని తెలుగులోకి కూడా తీసుకు రావచ్చు అనే ఆలోచన చేసి ఆ మేరకు ముందుకు వెళ్లారు. నిజానికి బిగ్ బ్రదర్ విషయానికి వస్తే ఇందులో ముందు సెలబ్రిటీ సీజన్, కామన్ మ్యాన్ సీజన్ అని వేరుగా ఉండేవి. దానిని అడాప్ట్ చేసుకున్న హిందీ విషయానికి వస్తే హిందీ ఆడియన్స్ సామాన్య ప్రజలను పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో సెలబ్రిటీలు మాత్రమే హౌస్ లోకి తీసుకుంటూ వచ్చారు, అదే పద్ధతిని ఫాలో అయ్యి తెలుగులో కూడా మొదటి మూడు సీజన్లు కొంతవరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న వారిని తీసుకున్నారు. నాలుగో సీజన్ లో అయితే కొంత మంది పేర్లు కూడా తమకు తెలియవు అంటూ అప్పట్లో వీక్షకులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు కూడా. అయినా సరే పద్ధతి మార్చుకోని బిగ్ బాస్ నిర్వాహకులు మళ్లీ ఈసారి కూడా కొంతమంది పరిచయం లేని వారిని హౌస్ లోకి పంపి చర్చకు తావిచ్చారు. కొందరు కేవలం యూట్యూబ్ చూసేవారికి పరిచయం ఉన్న వారయితే మరికొందరు ఎవర్రా బాబు అని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..

Also Read: టాలీవుడ్లో మొదటిసారి ఇలాంటి పోటీ

ఈ అంశం మీదనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు బిగ్ బాస్ అనే షో ఒక వృధా షో అని కొంత మంది కామెంట్లు చేస్తుండగా అందులోనూ ఊరు పేరు తెలియని వారిని తీసుకొచ్చి కూర్చో పెడితే ఉపయోగం ఏమిటి అని మరి కొంత మంది ప్రశ్నిస్తున్నారు. గత సీజన్లు బాగానే ఉండేవి కానీ ఈ సీజన్ చూస్తుంటే ఏ మాత్రం ఆసక్తికరంగా కంటెస్టెంట్ లు లేరని అంటున్నారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులకు బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ లకు రెమ్యూనరేషన్ చెల్లిస్తూ ఉంటారు. ఎవరి మార్కెట్ పరిధి మేరకు వారికి ఎంత చెల్లించాలి అనే విషయం మీద ముందే నిర్వాహకులు ఒక ఒప్పందానికి వస్తారు. ఇప్పుడు ఎవరికీ తెలియని హమీదా ఖాతూన్, జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల, లహరి షా రీ వంటి వాళ్లు ఒకవేళ బిగ్ బాస్ కి ఎదురు డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్లారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ పరిస్థితి. గతంలో ఇలాగే కామన్ మ్యాన్ అంటూ వచ్చిన నూతన్ నాయుడు వ్యవహారం ఏమయిందో మనం చూశాం.

ఈ సారి మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి 19 మంది కంటెస్టెంట్ లోపలికి పంపడమే కాక ఐదో సీజన్ కావడంతో రైమింగ్ బాగుంటుందనో మరే ఇతర కారణాలో తెలియదు గానీ ముందు నుంచి ఫైవ్ ఎక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రచారంతో ముందుకు వచ్చింది బిగ్ బాస్ సంస్థ. ఈ ఊరు పేరు తెలియని కంటెస్టెంట్ లతో ఫైవ్ ఎక్స్ ఎంటర్టైన్మెంట్ అనేది కుదిరే పనేనా? ఇప్పటికే జెమినీ సైతం మీలో ఎవరు కోటీశ్వరులు, మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నంలో ఉండగా ఇలాంటి కంటెస్టెంట్స్ తో ప్రేక్షకులను ఎంతవరకు బిగ్ బాస్ ఆకట్టుకోగలదు అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఈ మొదటి వారానికి సంబంధించిన టి ఆర్ పి లు విడుదలైతే కానీ ఈ షో లాంగ్ రన్ వరకు ఏ మేరకు లాభపడ గలదు అనే విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఏ మేరకు జనాన్ని ఆకట్టుకోగలదు అనేది.

Written By

Chaganti V

Also Read: 19 మందితో కింగ్ నాగార్జున సందడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి