iDreamPost

Unclaimed deposits మీ డిపాజిట్లు ఉంటే వ‌చ్చి తీసుకోండి, RBIలో పేరుకుపోతున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న కోసం ప్ర‌చారం

Unclaimed deposits మీ డిపాజిట్లు ఉంటే వ‌చ్చి తీసుకోండి, RBIలో పేరుకుపోతున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న కోసం ప్ర‌చారం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India, RBI) కి క్లెయిమ్ చేయని డిపాజిట్లు రానురాను తలనొప్పిగా మారుతున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను 39 వేల 264 కోట్ల రూపాయలున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అమాంతం 48 వేల 262 కోట్లకు ఎగబాకాయి. వీటిలో అధిక శాతం తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ RBI ఒక జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఈ ఎనిమిది రాష్ట్రాల భాషల్లోనూ ఈ కాంపెయిన్ సాగుతుంది.

అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే?
RBI నిబంధనల ప్రకారం పదేళ్ళ పాటు ఎలాంటి లావాదేవీలూ జరగని సేవింగ్స్ లేదా కరెంట్స్ అకౌంట్స్, అలాగే మెచ్యూరిటీ పిరియడ్ దాటిన పదేళ్ళ లోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ (Unclaimed Deposits) అంటారు. ఇలా పేరుకుపోయిన డబ్బును RBI “డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్” కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అయితే ఇలా ట్రన్స్ఫర్ అయిన డబ్బును కూడా డిపాజిటర్లు వడ్డీ తో సహా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఉన్నప్పటికీ డిపాజిటర్లు తమ డబ్బు వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపడం లేదు. ఈ మేరకు సంబంధిత బ్యాంకులు, RBI ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కూడా పెద్దగా ఫలితాలనివ్వడం లేదు.

అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు కారణాలేంటి?
చాలా మంది అకౌంట్ హోల్డర్లు తాము ఆపరేట్ చేయని సేవింగ్స్, కరెంట్ అకౌంట్లను క్లోజ్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. మరికొందరు కాల పరిమితి దాటిపోయిన టర్మ్ డిపాజిట్లను తిరిగి తీసుకోవడానికిగాను రిడెంప్షన్ క్లెయిమ్స్ (redemption claims) సబ్మిట్ చేయరు. కొన్ని సందర్భాల్లో అకౌంట్ హోల్డర్లు చనిపోతారు. కానీ వారి వారసులు డబ్బు తీసుకెళ్ళడానికి మొగ్గు చూపరు. దీంతో ఇలా వేల కోట్లు పేరుకుపోతున్నాయి.
RBI తన జాతీయ స్థాయి కాంపెయిన్ ద్వారా ఇలాంటి వారందరిలో కదలిక తీసుకొచ్చి ఎవరికి చెందాల్సిన డబ్బును వారికే చేరవేసేలా చర్యలు తీసుకుంటోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి