iDreamPost

ఏపీలో మరో రెండు సెల్ ఫోన్ తయారీ యూనిట్లు, పరుగులు పెడుతున్న పారిశ్రామిక రథం

ఏపీలో మరో రెండు సెల్ ఫోన్ తయారీ యూనిట్లు, పరుగులు పెడుతున్న పారిశ్రామిక రథం

ఏపీలో పారిశ్రామిక రంగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే తమ కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ సంస్థలు విస్తరణకు అవకాశాలు పరిశీలిస్తున్నాయి. ఇతర ప్రముఖ సంస్థలు కూడా యూనిట్ల ప్రారంభానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే వెనక్కి పోయిందనుకున్న అదానీ మళ్లీ ఆసక్తి చూపుతోంది. తరలిపోయిందంటూ పెద్ద స్థాయిలో ప్రచారం చేసిన కియా సంస్థ విస్తరణ చేస్తున్నట్టు మరో 6వేల కోట్లకు పైగా పెట్టుబడులు సిద్ధం చేస్తున్నామని ప్రకటించింది.

తాజాగా ఫాక్స్ కాన్ సంస్థ కూడా అదే ప్రయత్నంలో ఉంది. యాపిల్, రెడ్ మీ వంటి ఫోన్లను ఈ సంస్థ తయారుచేస్తోంది. శ్రీ సిటీలో తన యూనిట్ సామర్థ్యం పెంచబోతున్నట్టు ప్రకటించింది. అందుకు తోడుగా మరో రెండు సెల్ ఫోన్ తయారీ యూనిట్లు పెడతామని తెలిపింది. కోవిడ్ అనంతరం మొబైల్ తయారీ యూనిట్ల పరిస్థితిపై కేంద్రం నిర్వహించిన వెబ్ నార్ లో ఈమేరకు ఫాక్స్ కాన్ ఇండియా హెడ్ ఫౌల్గర్ ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశీయ మొబైల్ మార్కెట్ విస్తరించబోతున్నట్టు ఆయన అంచనా వేశారు. ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో సమర్థవంతంగా పనిచేసిందని ఆయన కొనియాడారు. ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విస్తరణలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కి ఆయన సూచన చేశారు. శ్రీ సిటీలో తమ యూనిట్ పునః ప్రారంభానికి చూపించిన చొరవ అభినందనీయమన్నారు. త్వరలో ఏపీలో కొత్త యూనిట్ల స్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ తైవాన్ ప్రతిష్టాత్మక సంస్థ చేసిన ప్రకటనతో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకి ఉన్న సానుకూలత ఆచరణ రూపం దాల్చబోతున్నట్టు కనిపిస్తోంది. అదే జరిగితే స్థానికులకు ఉపాధితో పాటుగా రాష్ట్రాభివృద్ధికి అవకాశాలు మరింత మెరుగుపడినట్టుగానే చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి