iDreamPost

తిరుమల: లక్షిత మృతి కేసులో ట్విస్ట్‌.. చిన్నారిని చంపింది చిరుత కాదా?

  • Published Aug 12, 2023 | 11:15 AMUpdated Aug 12, 2023 | 11:15 AM
  • Published Aug 12, 2023 | 11:15 AMUpdated Aug 12, 2023 | 11:15 AM
తిరుమల: లక్షిత మృతి కేసులో ట్విస్ట్‌.. చిన్నారిని చంపింది చిరుత కాదా?

తిరుమలలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అలిపిరి కాలి నడక దారిలో కనిపించకుండ పోయిన చిన్నారి లక్షిత మృతి చెందిన సంగతి తెలిసిందే. చిరుత దాడి చేయడం వల్ల లక్షిత మృతి చెందినట్లు భావిస్తుండగా.. తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన లక్షిత మృతదేహాన్ని శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం దగ్గర గుర్తించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం పాప మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఫారెస్ట్‌ అధికారులు చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి.. లక్షిత ఒంటి మీద ఉన్న గాయాలను బట్టి.. అది చిరుత దాడి కాదని.. ఎలుగుబంటి దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘పాప శరీరంపై ఉన్న గాయాలను పరిశీలిస్తే.. చిరుత దాడి చేసినట్లుగా అనిపించడం లేదు. ఎలుగు బంటి దాడి చేసిందేమోనని అనుమానంగా ఉంది. సాధారణంగా ఎలుగు బంట్లు ముందుగా తలపై దాడి చేస్తాయి. పాప ఒంటి మీద కూడా ఇలాంటి గాయాలే ఉన్నాయి. అయితే పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ వచ్చాక దీనిపై ఒక క్లారిటీ వస్తుంది’’ అని తెలిపారు. పైగా చిన్నారిని చిరుత లాక్కెళ్లడం ఎవరు చూడలేదని.. అందుకే తాము అనుమానిస్తున్నామన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి స్పష్టత రావాలంటే.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాల్సి ఉందని.. తమ సిబ్బందితో కలిసి ఆ సమీప ప్రాంతాల్లో గాలిస్తామన్నారు ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెంది దినేష్, శశికళ దంపతులు బంధువులతో కలిసి సుమారు 10మంది తిరుమలకు కాలినడకన బయల్దేరారు. శుక్రవారం రాత్రి 7.30 ప్రాంతంలో దినేష్ కుమార్తె ఆరేళ్ల లక్షిత కనిపించకుండా పోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్షిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పాప ఆచూకీ కోసం గాలించడం ప్రాంరభించారు.

కానీ ఎక్కడా పాప ఆచూకీ కనిపించలేదు. చివరకు శనివారం ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర చిన్నారి లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. తిరుపతి రుయా ఆసుపత్రి కి మృతదేహం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దైవ దర్శనం కోసం వస్తే.. కన్న బిడ్డ మృతి చెందడంతో.. లక్షిత తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి