iDreamPost

ట్రంపొచ్చాడు

ట్రంపొచ్చాడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటన ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం ట్రంప్‌ సతీసమేతంగా భారత్‌ చేరుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్‌ సోమ, మంగళవారాల్లో గుజరాత్, ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య పర్యటించనున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో కలసి సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. అక్కడ నుంచి ప్రపంచంలోనే పెద్దదైన మోతేరా క్రికెట్‌ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, ట్రంప్‌లు ర్యాలీగా వెళ్లనున్నారు. గతేడాది అమెరికాలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం తరహాలో తాజాగా నమస్తే ట్రంప్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్‌ దంపతులు తాజ్‌మహల్‌ సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లడంతో ట్రంప్‌ మొదటి రోజు పర్యటన పూర్తవుతుంది.

రెండో రోజు ఆసాంతం ట్రంప్‌ దేశ రాజధాని ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతిభవన్‌లో స్వాగత కార్యక్రమం తర్వాత హైదరాబాద్‌ హౌస్‌లో ట్రంప్, మోడీ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఇరు దేశాల మధ్య పలుఒప్పందాలు జరగనున్నాయని సమాచారం. సమావేశం అనంతరం ఒప్పందాలపై మీడియా సమావేశంలో ట్రంప్, మోడీ పాల్గొననున్నారు. సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌తో భేటీ అయిన తర్వాత రాత్రి 10 గంటలకు ట్రంప్‌ తిరిగి అమెరికాకు బయలుదేరనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి