iDreamPost

Tollywood Release Dates : టాలీవుడ్ వాయిదాలు ఇకనైనా ఆగాలి

Tollywood Release Dates :  టాలీవుడ్ వాయిదాలు ఇకనైనా ఆగాలి

నిన్న సాయంత్రం మీడియా మొత్తం రిలీజ్ డేట్ల ప్రకటనలతో హోరెత్తిపోయింది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా ఎక్కడ చూసినా మన తెలుగు సినిమాల గురించిన చర్చలే. కేవలం నిమిషాల వ్యవధిలో ప్రొడక్షన్ హౌసులు పోటీ పడి అనౌన్స్ మెంట్లు ఇవ్వడంతో మాములు రచ్చ జరగలేదు. ‘ఆర్ఆర్ఆర్’ వల్ల ఇండస్ట్రీ ఏ స్థాయిలో ప్రభావితం చెందుతోందో మరోసారి స్పష్టమయింది. ‘ఆచార్య’ ఏప్రిల్ 1 నుంచి 29 షిఫ్ట్ కాగా ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25 ఆప్షన్ ని అలాగే ఉంచుకుని అది మిస్ అయితే ఏప్రిల్ 1 వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పింది. ‘సర్కారు వారి పాట’ ఏకంగా మే 12కి వెళ్ళిపోయి మహేష్ బాబు అభిమానుల టెన్షన్ ని పూర్తిగా తగ్గించేసింది.

‘ఎఫ్3’ మాత్రం ముందు చెప్పిన డేట్ కే కట్టుబడింది. ఏప్రిల్ 28తో మరోసారి పోస్టర్ వదిలింది. ఇలా మొత్తం అయిదు సినిమాలకు సంబంధించిన భారీ ప్రకటనలతో మిగిలిన నిర్మాతలు అలెర్ట్ అయ్యారు. చాలా వాటికి మార్పులు తప్పేలా లేవు. ఉదాహరణకు రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ని మార్చి 25కి షెడ్యూల్ చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వస్తోంది కాబట్టి తప్పుకోవడం మినహా వేరే మార్గం లేదు. మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలనేది చాలా సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ పునరాలోచనలో పడింది. వరుణ్ తేజ్ ‘గని’ని ఈ నెల 18కే తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉంది గీత ఆర్ట్స్ సంస్థ. ఇంకొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది.

ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు ఈ డేట్లను ఎంతవరకు నమ్మొచ్చు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పైన చెప్పిన సినిమాలన్నీ దాదాపుగా అయిదారుసార్లు రిలీజ్ మార్చుకున్నవే. ఇప్పుడు మాత్రం కన్ఫర్మా అని అడిగితే వాళ్ళు మాత్రం ఏం చెప్పగలరు. కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతోంది కాబట్టి మరోసారి వాయిదాలు పునరావృత్తం కావనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ మహమ్మారి మన కంట్రోల్ లో ఉండేది వచ్చేది కాదుగా. అందుకే కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ పర్వం ముగిసింది కాబట్టి అన్ని టీములు కొత్తగా ప్రమోషన్లను ప్లాన్ చేసుకుంటున్నాయి

Also Read : RRR : రాజమౌళి భలే ట్విస్టు ఇచ్చారుగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి