iDreamPost

రూ. 2 వేల నోట్ల మార్పిడికి నేడే ఆఖరు.. ఇంకా వెనక్కి రావాల్సినవి రూ. 12 వేల కోట్లు

రూ. 2 వేల నోట్ల మార్పిడికి నేడే ఆఖరు.. ఇంకా వెనక్కి రావాల్సినవి రూ. 12 వేల కోట్లు

నల్లధనాన్ని రూపు మాపడంలో భాగంగా కేంద్రప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే రూ. 2 వేల నోటును చలామణిలోకి తీసుకొచ్చారు. దాదాపు గత ఆరున్నర సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కాగా ఆ కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు దేశ ప్రజలకు సుమారు 4 నెలల సమయం ఇచ్చింది ఆర్బీఐ.

కాగా రూ. 2 వేల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సెప్టెంబర్ 30 2023 వరకు రూ. 2 వేల నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపంది. ఆ గడువులోగా నోట్లను మార్పిడి చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలో ఆర్బీఐ విధించిన గడువు ముగియడంతో మరోసారి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 07 2023 వరకు రూ. 2 వేల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా ఈ గడువు కూడా నేటితో ముగియనుంది.

అయితే ఇప్పటి వరకు చలామణి నుంచి ఉపసంహరించుకున్న 3.43 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లలో 87 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇంకా రూ.12 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గడువు ముగిసిన తర్వాత రూ.2 వేల నోట్లను కలిగిన వారి కోసం ఆర్బీఐ ఓ సూచన చేసింది. ఆర్బీఐ సూచించిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కరూ గరిష్టంగా రూ.20 వేలు విలువ చేసే రూ. 2 వేల నోట్లను మాత్రమే డిపాజిట్ చేసే వీలుంటుందని ఆర్బీఐ సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి