iDreamPost

పరువు హత్య: ప్రేమించుకున్నారని.. చంపి మొసళ్లకు ఆహారంగా వేశారు!

పరువు హత్య: ప్రేమించుకున్నారని.. చంపి మొసళ్లకు ఆహారంగా వేశారు!

ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడతారు. అయితే చిగురించిన ప్రతి ప్రేమ వివాహం దాకా వెళ్తుందని గ్యారెంటీ లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులు కూడా కులం, సమాజం అంటూ పంతానికి పోకుండా.. కన్న పిల్లల సంతోషం కోసం ఇష్టపడిన వారికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. అయితే అందరి ప్రేమ కథ అలా పెళ్లితో సుఖాంతం అవ్వాలనేం లేదు. ఇప్పటికీ పరువు కోసం ప్రాణాలు తీసే వ్యక్తులు ఉన్నారంటే నమ్ముతారా? ఈ వార్త చదివాక నమ్మక మానరు. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. ఒక ప్రేమ జంటను సొంత కుటుంబమే కాల్చి చంపి మొసళ్లకు ఆహారంగా వేసింది.

ఈ ఘోరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మొరెనా జిల్లా బలుపురా గ్రామానికి చెందిన రాధేశ్యామ్(21), రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాని తోమర్(18) ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అయితే వీళ్ల ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. శివానీ ప్రేమ విషయం వారి ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. వారి ప్రేమకు అంగీకరించకపోగా.. వాళ్లిద్దరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా.. రాధేశ్యామ్, శివానీ తోమర్ ను కాల్చి చంపేశారు. తర్వాత వారి మృతదేహాలకు బండరాళ్లు కట్టి.. మొసళ్లు సంచరించే నదిలోకి విసిరేశారు.

తన కొడుకు కనిపించడం లేదంటూ రాధేశ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అయితే మొదట పోలీసులు శివానీ, రాధేశ్యామ్ పారిపోయి ఉంటారని భావించారు. కానీ, వాళ్లిద్దరూ పారిపోవడం ఎవరూ చూడలేదని తెలియడంతో వారికి అనుమానం వచ్చింది. శివానీ తోమర్ తండ్రి, బంధువులపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వాళ్లిద్దరినీ తాము హత్య చేసినట్లు అంగీకరించారు. జూన్ 3న ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. యువతీయువకుడిని కాల్చి చంపి కాళ్లకు బండరాళ్లు కట్టి చంబల్ నదిలో విసిరేసినట్లు తెలియజేశారు.

మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే వారి మృతదేహాలు దొరుకుతాయని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే.. చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో 2000కు పైగా ఎలిగేటర్లు, 500కుపైగా మంచినీటి మొసళ్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇప్పటికీ పరువు హత్యలు చేస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రెండు నిండు ప్రాణాలను బలిగొన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరువు కోసం హత్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి