iDreamPost

రత్నప్రభకే చాన్స్‌..!

రత్నప్రభకే చాన్స్‌..!

తిరుపతి ఉప ఎన్నికపై కమలదళంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. జనసేన పార్టీతో సంబంధం లేకుండానే ఆ పార్టీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసింది. దీంతో జనసేన, బీజేపీ మధ్య తెలంగాణాలో ఏర్పడిన వివాదం ఏపీలోనూ రాజుకుంది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారనే అంశానికి తెరపడింది. పోటీకి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు మాజీ ఐఏఎస్‌ల కుర్చీలాటకి తెరపడింది. ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తున్న దాసరికి శ్రీనివాసులు, రత్నప్రభ, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అవకాశం కోసం పోటీపడ్డారు. అయితే తిరుపతి ఉపఎన్నిక ప్రచార కమిటీ సభ్యులుగా దాసరి శ్రీనివాసులు, రావెల కిషోర్‌బాబులకు ఆ పార్టీ ప్రచార బాథ్యతలు అప్పగించింది. దీంతో రేసులో రత్నప్రభ ఒక్కరే నిలిచినట్లయింది. అభ్యర్థి ఎవరనేది బీజేపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ నుండి రత్న ప్రభకు పోటీచేసే అవకాశం ఆమెకే మెండుగా ఉన్నాయని పార్టీలోని పెద్దల అభిప్రాయం. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

జనసేనతో సంబంధం లేకుండానే.. 

జనసేన, బీజేపీ మిత్ర పక్షాలైనప్పటికీ జనసేనతో సంబంధం లేకుండా బీజేపీ తన ప్రచార కమిటీని ప్రకటించింది. ఇటీవల తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జనసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అంతేకాకుండా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బీజేపీ తెలంగాణ నాయకత్వంపై ఘాటుగా విమర్శించారు. అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అదికూడా ఎన్నికలు జరుగుతున్న రోజునాడే మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్‌ బీజేపీపై నిప్పులు చెరిగారు. విజయవాడలో కేవలం బీజేపీ వల్ల తాము ఓటమి పాలయ్యామని ఆరోపించారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లోనూ జనసేన బీజేపీతో కలిసి వెళ్లేందుకు సముఖంగా లేదనే సంకేతాలు పంపించింది. దానికి తగినట్లుగానే బీజేపీ కూడా స్పందించింది. జనసేన తమతో కలసిరాకపోయినా తిరుపతి లోక్‌ సభ ఉప ఎన్నికకు తాము సిద్దమనే సంకేతాలిచ్చింది.

Also Read : తిరుపతి ఉప ఎన్నిక.. టీడీపీకి పెద్ద చిక్కొచ్చిపడిందే..!

జంబో కమిటీ..

ప్రచార కమిటీకి మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా ఎంపీలు టీజీ వెంకటేశ్‌, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, పార్టీ మాజీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ, శాంతారెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, ఐవైఆర్‌ కష్ణారావు, దాసరి శ్రీనివాసులు, రావెల కిశోర్‌ బాబు, వాకాటి నారాయణరెడ్డి, చంద్రమౌళి, సుధీశ్‌ రాంభొట్లను నియమించారు. ఇక, పురందేశ్వరి, సత్యకుమార్‌ లను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొనగా, ప్రచార కమిటీకి ఎక్స్‌ అఫిషియో ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి మురళీధరన్‌, బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్‌ దేవధర్‌, ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు, నూకల మధుకర్‌, పీవీఎన్‌ మాధవ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, సూర్యనారాయణరాజు, లోకుల గాంధీ పేర్లను ప్రకటించారు.

Also Read : తిరుపతిలో బీజేపీ ఆశలు సన్నగిల్లాయ్యా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి