iDreamPost

తిరుపతిలో బీజేపీకి డిపాజిట్ గల్లంతేనా?

తిరుపతిలో బీజేపీకి డిపాజిట్ గల్లంతేనా?

తిరుపతి ఉప ఎన్నికలో గెలవాలని ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది బీజేపీ. కానీ అధికార వైఎస్సార్ సీపీ ముందు తేలిపోయింది. కనీసం ప్రభావం కూడా చూపలేకపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ లీడర్లు బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చి ప్రచారం చేసినా.. ఫలితం మారలేదు. ప్రజలు ఏకపక్షంగా వైసీపీకి పట్టంకట్టారు. భారీ మెజారిటీ దిశగా గురుమూర్తి దూసుకువెళ్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ను బట్టి చూస్తే బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

తిరుపతి ఉప ఎన్నికలో మొత్తం 11 లక్షల దాకా ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ దక్కాలంటే కనీసం 1/6 వంతు ఓట్లు రావాలి. వ్యాలిడ్ ఓట్లు 10.6 లక్షల వరకు ఉన్నాయనుకుంటే.. అందులో కనీసం 1.8 లక్షల ఓట్లు రావాలి. అప్పుడే డిపాజిట్ దక్కుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. బీజేపీకి కనీసం 75,000 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మధ్యాహ్నం 3 గంటల దాకా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు వచ్చిన ఓట్లు 43 వేలు మాత్రమే. మొత్తం ఓట్లలో ఇది 5.4 శాతమే.

Also Read : యానాంలో సీఎంకి చెక్ పెట్టిన యువకుడు, మల్లాడి ఆశలు గల్లంతేనా?

ఈ ఎన్నికలపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఏపీలో బలపడేందుకు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకుంది. జనసేనను ఒప్పించి పోటీకి సిద్ధమైంది. రెండో స్థానంలో నిలిచి వైసీపీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోవాలని ఆశించింది. హిందుత్వమే ప్రధాన అజెండాగా ఆ పార్టీ నేతలు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. అయితే ఏపీలో మత రాజకీయాలకు చోటు లేదని తిరుపతి ఓటర్లు తేల్చి చెప్పారు. రెండో స్థానం కాదు కదా.. కనీసం డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేని పరిస్థితి బీజేపీకి తలెత్తింది. ఈ ఎన్నికతో బీజేపీ, జనసేన బలం ఎంతనేది కూడా తేలిపోయింది.

బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రమే కాదు.. కాంగ్రెస్ క్యాండిడేట్ చింతా మోహన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిజానికి కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరం. తిరుపతి ఉప ఎన్నికలో కనీసం 1 శాతం ఓట్లు కూడా రాలేదు. పోలైన ఓట్లలో 7వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏపీలో పూర్తిగా భూస్వాపితమైన కాంగ్రెస్ కు.. ఆ మాత్రం ఓట్లు రావడమే ఎక్కువ. మొత్తానికి రెండు జాతీయ పార్టీలు కూడా డిపాజిట్ కోల్పోవడానికి రెడీ అయ్యాయి.

Also Read : గెలుపు గులాబీదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి