iDreamPost

విప‌క్షాల డ్రామాలు.. ప‌రువు కోసం పాకులాట‌లు

విప‌క్షాల డ్రామాలు.. ప‌రువు కోసం పాకులాట‌లు

తిరుపతి లోక్‎సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఓట‌ర్లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఏపీలో అధికార పార్టీ గెలుపు ను ఎవ‌రూ ఆప‌లేర‌నేది వ‌రుస ఎన్నిక‌లు ఎప్పుడో రుజువు చేశాయి. తిరుప‌తిలో కూడా అదే జ‌ర‌గబోతోంద‌ని ముంద‌స్తు స‌ర్వేలు తెలియ‌జేశాయి. ఎవ‌రి నోట విన్నా కూడా అదే మాట‌. వ‌రుస ఓట‌ముల‌తో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న విప‌క్షాలు ఓ ప‌క్క పోలింగ్ జ‌రుగుతుండ‌గా, మ‌రో ప‌క్క స‌రికొత్త డ్రామాలకు తెర‌లేపుతున్నాయి. ఓట‌మి త‌ప్ప‌ద‌ని వారికి ముందే తెలుసు. ఒక వేళ ఘోరంగా ఓడిపోతే ప‌రువు కాపాడుకునేందుకు కొత్త ఎత్తులు మొద‌లుపెడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అధికార పార్టీపై ఏదో ఒక దుష్ప్ర‌చారం చేయ‌డం ద్వారా త‌మ‌కు ఓట్లు త‌గ్గ‌డానికి అది ఒక కార‌ణంగా చెప్పుకోవ‌డానికి దొంగ ఓట్ల కాన్సెప్ట్ ను తెర‌పైకి తెచ్చాయి. చిత్ర‌మేమిటంటే విప‌క్షాల‌న్నీ ఈ విష‌యంలో ఒక‌టే పాట పాడ‌డం.

ఆ అవ‌స‌రం ఉందా..?

సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ కొత్త త‌ర‌హా విధానాల‌కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఆయ‌న హ‌యాంలో సంక్షేమ రాజ్యం కొన‌సాగుతోంది. ప్ర‌తి కుటుంబం ల‌బ్ది పొందుతోంది. ప్ర‌జ‌ల‌పై వైసీపీ ప‌ట్ల అంతులేని ఆద‌రాభిమానాలు ఉన్నాయి. ఆ విష‌యం ఇటీవ‌ల వ‌రుస‌గా జ‌రిగిన పంచాయ‌తీ, మున్సిప‌ల్, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో స్ప‌ష్ట‌మైంది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కూడా ప్ర‌జ‌లు అధికార పార్టీ అభ్య‌ర్థుల వైపే మొగ్గుచూపిన‌ట్లు తెలిసింది. వాటి ఫ‌లితాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది.

ఏపీలో తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌లో గెలుపెవ‌ర‌ది అనేది అర్థ‌మైపోతుంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో వైసీపీకి దొంగ ఓట్లు వేయాల్సిన అవ‌స‌రం ఉంటుందా..?, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఉన్న పార్టీకి ఆ అవ‌స‌రం ఉంటుంటుదా..?., మ‌రి ఎందుకోసం విప‌క్షాలు ఈ డ్రామాలు ఆడుతున్నాయ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారి వాద‌న‌ల‌ను వెలుగులోకి తెచ్చేందుకు అనుకూల మీడియా విప‌రీతంగా కృషి చేస్తోంది. వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తరలించారని, నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని, ఫేక్ ఓటరు కార్డులతో ఓటేసేందుకు కడప నుంచి వ‌చ్చార‌ని అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు అల్లేస్తున్నారు.

చంద్ర‌బాబు దొంగ డ్రామాలు

ప్రశాంత వాతావరణంలో తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. అయితే చంద్రబాబు ఈ రోజు కూడా అత్యంత హేయమైన చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. పోలింగ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తిరుపతికి వచ్చే టూరిస్టులు దొంగ ఓటర్లని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందనని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు తాను గతంలో చేసిన పనులను తమ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓడిపోతారని తెలిసే బాబు ముందుగా సాకులు వెతుక్కుంటున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మహన్‌రెడ్డి‌ వెంట 75 శాతానికిపైగా ఓటర్లు ఉన్నారన్నారు. దొంగ ఓట్లు వేసే అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డిపాజిట్‌ కూడా దక్కదనే భయంతోనే చంద్రబాబు దొంగ డ్రామాలు ఆడుతున్నారని, ఓటమిని ఊహించిన బాబు ముందుగానే సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ కుట్ర‌ల‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తాం..

పోలింగ్‌పై టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందన్నారు. ప్రజా బలం లేకే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటమికి చంద్రబాబు కారణాలు వెతుక్కుంటున్నారని.. ఇకనైనా ఆయన తన తప్పులు తెలుసుకుంటే ప్రజల్లో ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు.

Also Read : రీపోలింగ్‌.. టీడీపీ, బీజేపీలకు మైండ్‌ బ్లాక్‌

ప్ర‌శాంతంగా పోలింగ్ : డీజీపీ

తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయ‌న డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. సరిహద్దుల్లో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారంతో… అనుమానితులపై నిరంతర నిఘాను ఏర్పాటు చేశామని డీజీపీ సవాంగ్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి