iDreamPost

రీపోలింగ్‌.. టీడీపీ, బీజేపీలకు మైండ్‌ బ్లాక్‌

రీపోలింగ్‌.. టీడీపీ, బీజేపీలకు మైండ్‌ బ్లాక్‌

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.67 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ నేతలు హల్‌చల్‌ చేయడం ప్రారంభించారు. తిరుపతి రోడ్లపై పలు బస్సులను ఆపి.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను రప్పించి ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ నేతలు నానా యాగీ చేశారు.

వందల కొద్దీ బయట వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపించిన టీడీపీ, బీజేపీలు పోలింగ్‌ను రద్దు చేసి రీ పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రీ పోలింగ్‌ నిర్వహించాలని బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ డిమాండ్‌ చేసిన వెంటనే చంద్రబాబు అందుకున్నారు. కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో రీ పోలింగ్‌ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అదే సమయంలో ఎన్నికల అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్‌ ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బాబు ప్రశ్నించారు.

దొంగ ఓట్లు అంటూ నానా యాగీ చేసి.. ఆ తర్వాత రీ పోలింగ్‌ డిమాండ్‌ చేసిన టీడీపీ, బీజేపీలకు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ నుంచి ఈ తరహా స్పందన వస్తుందని ఊహించిన టీడీపీ, బీజేపీ నేతలకు మైండ్‌ బ్లాక్‌ అయింది. రీపోలింగ్‌కు తాము సిద్ధమని, ఒకటి కాదు పది సార్లు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామని సజ్జల స్పష్టం చేశారు. రీ పోలింగ్‌ జరిగిన ప్రతి సారి తమ మెజారిటీ పెరుగుతుందన్నారు.

ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవనే ఆందోళనతో టీడీపీ, బీజేపీలు దొంగ ఓట్లు అంటూ నాటకాలు ఆడుతున్నాయని సజ్జల విమర్శించారు. కేవలం తిరుపతిలోనే దొంగ ఓట్లు అంటూ టీడీపీ, బీజేపీ నేతలు ఎందుకు యాగీ చేస్తున్నారో సజ్జల వివరించారు. రోజుకు 50 వేల నుంచి లక్ష వరకూ తిరుమలకు భక్తులు వస్తారని, వారి బస్సులను ఆపి.. బయట వ్యక్తులు అంటూ హల్‌చల్‌ చేసిన వీడియోలను టీడీపీ అనుకూల మీడియలో ప్రసారం చేయిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ డ్రామా మిగతా ఆరు నియోజకవర్గాల్లో సాధ్యం కాదు కాబట్టే.. తిరుపతిని ఎంచుకున్నారని పేర్కొన్నారు. భారీ మెజారిటీ వచ్చే తమకు వందల్లో దొంగ ఓట్లు వేయించాల్సిన అవసరం ఏముందంటూ సజ్జల ప్రశ్నించడంతో.. టీడీపీ, బీజేపీ డ్రామాలు తేటతెల్లమయ్యాయి.

Also Read : ఉప ఎన్నికలు: మధ్యాహ్నం ఒంటి గంటకు ఆశాజనకంగా పోలింగ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి