iDreamPost

ఫిక్స్డ్ డిపాజిటర్లకు ఇక పండగే పండగ, వడ్డీ రేట్లు పెంచిన ప్రధాన బ్యాంకులు

ఫిక్స్డ్ డిపాజిటర్లకు ఇక పండగే పండగ, వడ్డీ రేట్లు పెంచిన ప్రధాన బ్యాంకులు

ఈ పండగ సీజన్ ఫిక్స్డ్ డిపాజిటర్లకు మంచి కాలం మోసుకొచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెంచుతున్నట్లు దేశంలోని ప్రధాన బ్యాంకులు ప్రకటించాయి. అధిక డిపాజిట్లు ఆకర్షించి రుణ డిమాండ్ ను ఎదుర్కొనేందుకే బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. రుణ వృద్ధి కోసం బ్యాంకులు తమ సొంత వనరులపై ఆధారపడాలని RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో నిధులు సమీకరించుకోవడానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడమే మార్గమని బ్యాంకులు భావిస్తున్నాయి. ఏఏ బ్యాంకులు ఏమేరకు వడ్డీ రేట్లు పెంచాయో ఓసారి చూద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India)
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా వెయ్యి రోజుల “ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్” లాంచ్ చేసింది. ఆగస్టు 15న మొదలైన ఈ ఆఫర్ గడువు అక్టోబర్ 30తో ముగుస్తుంది. SBI ఈ స్కీమ్ కింద 6.10 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ రేటు 6.60గా ఉంది.


బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)
ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించిన “తిరంగా డిపాజిట్ స్కీమ్” కింద 444 రోజుల డిపాజిట్లకు 5.75 వడ్డీ రేటు ఫిక్స్ అయింది. అదే 555 రోజులకైతే 6 శాతం వర్తిస్తుంది. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ పథకం డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. రెండు కోట్ల రూపాయల రీటెయిల్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు మరో 0.5 శాతం అధిక రేటు వర్తిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆగస్టు 19న 1,111 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సాధారణ కస్టమర్లకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ రేటు ఇస్తోంది.
ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI Bank)
ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను 40 పాయింట్ల దాకా పెంచింది. 7 రోజులు మొదలుకొని పదేళ్ళ వరకు వివిధ కాల పరిమితులకు సంబంధించిన కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 19 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ మధ్య డిపాజిట్లకు వడ్డీ రేటును 5.7 నుంచి 6.1 దాకా పెంచింది. అలాగే ఐదేళ్ళ నుంచి పదేళ్ళ మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు 5.75 నుంచి 5.9 వరకు వడ్డీ రేటు పెంచింది. అలాగే టాక్స్ సేవింగ్ డిపాజిట్లపైన 6.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు (HDFC బ్యాంకు)
అలాగే HDFC బ్యాంకు కూడా మూడు నుంచి ఐదేళ్ళ కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లకు 6.1 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇది 6.6 శాతంగా ఉంది.
ఇతర బ్యాంకులు
కెనరా బ్యాంక్ 666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లకు 6 శాతం వడ్డీరేటు ఇస్తోంది. అయితే సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం అధిక రేటు వర్తిస్తుంది. ఇక యాక్సిస్ బ్యాంక్ 75 వారాల FD స్కీమ్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 6.05 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తించే ఈ ఆఫర్ ఆగస్టు 18 నుంచి 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి