iDreamPost

ఎస్ అనేశారు – రావాల్సింది సినిమాలే

ఎస్ అనేశారు – రావాల్సింది సినిమాలే

ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లకు అనుమతులు జారీ చేసింది. ముందు నుంచి ఊహించినట్టే సగం సీట్ల కండీషన్ మాత్రం కొనసాగుతుంది. శానిటైజేషన్ లాంటి నిబంధనలన్నీ యథావిథిగా కొనసాగనున్నాయి. కాకపోతే సెకండ్ షోలకు మాత్రం అవకాశం లేదు. వ్యాపార లావాదేవీలు ఏవైనా సరే 10 లోపే మొత్తం పూర్తి చేయాలి. సో రాత్రి పూట ఆటలు ఇప్పట్లో చూడటం కల్లే, ఇక తెలంగాణ కూడా గత నెలే ఓకే అన్నప్పటికీ కొంత స్పష్టత మిస్ అవుతోంది. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఇప్పటికే రెండు నెలలకు పైగా తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. నిర్మాతలేమో ప్రభుత్వాల అనుమతుల కోసం ఎదురు చూస్తూ వచ్చారు.

ఇప్పుడు ఏ సినిమాలు విడుదలకు రెడీ అవుతాయన్నది వేచి చూడాలి. లవ్ స్టోరీ, టక్ జగదీశ్ లాంటివి అన్ని ఆటలు ప్రదర్శించి ఆక్యుపెన్సి ఆంక్షలు తీసేస్తే తప్ప విడుదల చేసేందుకు సుముఖంగా లేవు. ఈ పరిణామాన్ని చిన్న సినిమాలు అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. తక్కువ బడ్జెట్ లో రూపొందించిన వాటిని వీలైనంత త్వరగా రిలీజ్ చేసుకుంటే తక్కువో ఎక్కువో డీసెంట్ కలెక్షన్లతో బయట పడవచ్చు. కంటెంట్ బాగుంటే మౌత్ టాక్ జనంలోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా క్రౌడ్ పెరుగుతుంది. హౌస్ ఫుల్ బోర్డులు చూడాలన్న అత్యాశలకు పోకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.

రాబోయే రోజులు ఇప్పుడు కీలకం కానున్నాయి. ఒకపక్క అగ్ర నిర్మాతలు సైతం ఓటిటి డీల్స్ వైపు చూస్తున్న తరుణంలో థియేటర్ సినిమాను బ్రతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క స్టార్ హీరో చిత్రం కూడా విడుదల తేదీని ప్రకటించని నేపథ్యంలో ఇంకెవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. థర్డ్ వేవ్ రాక గురించి జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కొట్టి పారేయడం లేదు. జాగ్రత్తగా ఉండండని మాత్రమే హెచ్చరిస్తోంది. ఈ అయోమయం పూర్తిగా తీరితే తప్ప కొందరు నిర్మాతలు రిలీజులకు ససేమిరా అంటున్నారు. అసలు ఎవరు చొరవ తీసుకుని ముందడుగు వేస్తారో చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి