iDreamPost

భర్త మృతి తట్టుకోలేక అంత్యక్రియల్లోనే భార్య మృతి!

భర్త మృతి తట్టుకోలేక అంత్యక్రియల్లోనే భార్య మృతి!

భార్యాభర్తల అనుబంధం ఒక పవిత్రమైన బంధం. వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట నూరేళ్లూ కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. భార్యాభర్తల సంబంధానికి పునాది నమ్మకం.. ప్రేమ. అలా ఉంటేనే ఆ బంధం కలకాలం సాఫీగా సాగుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇటీవల భార్యాభర్తల బంధం మూన్నాళ్ల ముచ్చటగానే ముగుస్తుంది. పెళ్లైన ఏడాదికే భార్యాభర్త మధ్య విభేదాలు రావడంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అలాంటిది తన భర్త మరణం తట్టుకోలేకపోయిన ఓ భార్య అంత్యక్రియలు జరుగుతుండగానే కుప్పకూలిపోయింది. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్‌ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజోళి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన డబ్బ లక్ష్మిరెడ్డి (70) పాల్వాయికి చెందిన శంకరమ్మతో 50 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ పోషణ కోసం గద్వాలకు మకాం మార్చారు. అక్కడ హెడ్ పోస్టాఫీస్ సమీపంలో ఓ హూటల్ నిర్వహిస్తూ జీవిస్తున్నారు. పదేళ్ళ క్రితం లక్ష్మిరెడ్డి చిన్నకుమారుడు ఎల్లారెడ్డి కన్నుమూశాడు. ప్రస్తుతం కోడలు, వారి పిల్లల బాధ్యత ఈ దంపతులపై పడింది. అందరూ ఒక చోట ఉండి కష్టపడి వచ్చిన సంపాదనతో కాలం గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున లక్ష్మీరెడ్డి అకస్మాత్తుగా చనిపోయాడు. స్వగ్రామం అయిన పచ్చర్లకు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించారు. భర్త ఎడబాటును శంకరమ్మ భరించలేకపోయింది. సాయంత్రం లక్ష్మిరెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా శంకరమ్మ హఠాత్తుగా కుప్పకూలి పోయింది. చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. మార్గమధ్యలోనే ఆమె కన్నుమూసింది. భార్యాభర్తల అనుబంధం ఎంతో గొప్పదని.. భర్త మరణం తట్టుకోలేక శంకరమ్మ కన్నుమూసిందని గ్రామస్థులు కన్నీటిపర్యంతం అయ్యారు. గంటల వ్యవధిలోనే లక్ష్మిరెడ్డి, శంకరమ్మలు చనిపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి