iDreamPost

థియేటర్లకు అందుకే నో

థియేటర్లకు అందుకే నో

నిన్న తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇస్తూ జిఓ జారీ చేయడంతో భాగ్యనగరంలో సందడి మొదలైంది. ఆదేశాలు రావడం ఆలస్యం ముందే ఏర్పాట్లు చేసుకున్న కొన్ని సినిమాల యూనిట్లు వెంటనే రంగంలోకి దిగిపోయాయి. భారీ చిత్రాలు ఇంకా సీన్లోకి ఎంటర్ కాలేదు కానీ ఇవాళ రేపు అది కూడా జరిగిపోతోంది. గైడ్ లైన్స్ ప్రకారం యూనిట్ మెంబెర్స్ ని సాధ్యమైనంత తగ్గించి మరీ షూట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా థియేటర్ల ఓపెనింగ్ కి మాత్రం గవర్నమెంట్ ససేమిరా ఆనేసింది. ఈ నిర్ణయం కేంద్రం పరిధిలో ఉండటంతో తాను మాత్రం చేయగలిగింది ఏమి లేదు. ఒకవేళ రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నా పైనుంచి అనుమతి రానిదే రిస్క్ తీసుకోలేవు.

అందులోనూ ఇప్పటికిప్పుడు హాళ్లు తెరిచే మూడ్ లో యజమానులు కానీ ఓనర్లు కానీ లేరు. నిబంధనల ప్రకారం సీట్ల మధ్య గ్యాప్, థర్మల్ స్క్రీనింగ్ లాంటి ఏర్పాట్లు ఆర్థికంగా చాలా భారాన్ని కలిగిస్తాయని వాళ్ళ అభిప్రాయం. అందుకే ఈ విషయంగా పెద్దగా ఒత్తిడి తెచ్చే ఆలోచన కూడా వాళ్లకు లేదు.  ఈ నేపథ్యంలో సినిమా ప్రేమికులు ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు. ముంబై, చెన్నై, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేసారి తెరవాలన్న ప్రతిపాదన వైపే సెంటర్ మొగ్గు చూపుతోంది. ఇది ఇంకా ఆలస్యమయ్యే సూచనలు ఉండటంతో ఓటిటి రిలీజులు పెరిగే అవకాశం ఉంది. నిర్వహణ ఇప్పటికే తలకు మించిన భారంగా మారిన తరుణంలో థియేటర్ల యజమానుల్లో కొందరు అమ్మేసే లేదా షాపింగ్ కాంప్లెక్స్ లుగా మార్చే ఆలోచనలో ఉన్నారట.

మొత్తానికి మూవీ లవర్స్ మాత్రం ఇంకో రెండు నెలలు చిన్ని తెరలతో సర్దుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరో వైపు మల్టీ ప్లెక్సులు ఇచ్చిన కొన్ని ప్రతిపాదనలతో కూడిన వినతి పట్ల ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. లాక్ డౌన్ సడలింపుల్లో సినిమా చివరి ప్రాధాన్యంలో ఉండటంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం అవుతాయి కాబట్టి రెడీ టు రిలీజ్ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒక్కసారి థియేటర్లు తెరుచుకుని కొత్త రిలీజులు మొదలైతే ప్రతి శుక్రవారం కనీసం ఒక క్రేజీ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఇప్పటికీ ముందు విడుదల చేస్తామని ధైర్యం చేసే నిర్మాత ఎవరు. అదే అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. థియేటర్లకు సంబంధించి క్లారిటీ రాకముందే ప్రొడ్యూసర్ గిల్డ్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రిలీజులకు సంబంధించి ఒక అండర్ స్టాండింగ్ వచ్చేలా కీలకమైన చర్చ చేయబోతున్నట్టు తెలిసింది. రానున్న రోజుల్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి