iDreamPost
android-app
ios-app

రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలంటూ నోరుజారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలంటూ నోరుజారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాజాగా మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్.. తనపై మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శేజల్ పలుమార్లు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. అతడిపై ఢిల్లీకి వెళ్లి మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేయగా.. అందులో దుర్గం చిన్నయ్యకు కూడా సీటు కేటాయించడంపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. తాజాగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.

బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నోరు జారారు. ‘ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావొద్దు. ఆత్మహత్యలు చేసుకొని చావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అన్నారు. రైతులు ఆకలితో, ఆత్మహత్యలు చేసుకుని చావకూడదని చెప్పబోయి.. అలా గబుక్కున నోరు జారారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్పీచ్‌లు ఇచ్చే సమయంలో కాస్త ఆచితూచి మాట్లాడాలని, తాము ఏం మాట్లాడుతున్నామో ముందే ప్రిపేర్ అయితే బెటర్ అని చెబుతున్నారు.