iDreamPost

ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో లో తీవ్ర ప్రకంపనలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో లో తీవ్ర ప్రకంపనలు

ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఈనేపధ్యంలో ఢిల్లీ పిసిసి ఇంచార్జ్ గా ఉన్న పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు వరుసగా 3 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస పరాభవాలు చవిచూస్తూ పరువు పోగొట్టుకుంటుంది. మాజీ సియం దివంగత నేత షీలా దీక్షిత్ హాయాంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని పీసీ చాకో విమర్శలు చేశారు. దీనితో స్వపక్షం నుండే ఆయనపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో తరువాత అయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే పార్టీలో కొందరు వ్యక్తులు తనకు వ్యతిరేకంగా పనిగట్టుకొని ప్రచారం చేశారని, కాంగ్రెస్ ఘోర ఓటమి వెనుక ఎవరున్నారో తనకి తెలుసంటూ చాకో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

AAP పార్టీ స్థాపించినప్పటి నుండే ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి ఆజ్యం పడింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధాంతరంగా AAP ప్రభుత్వం నుండి బయటకి రావడం కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదమని చెప్పకతప్పదు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకపోవడంతో ఘోర అపప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో మిత్రపక్షం ఆర్జేడీ తో పొత్తు పెట్టుకొని మొత్తం 70 స్థానాలకు గాను 66 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 63 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి పరువు పోగొట్టుకుంది.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో AAP విజయాన్ని తానూ స్వాగతిస్తున్నట్టు చిదంబరం ప్రకటించిన కొద్దిసేపటికే ఢిల్లీ కాంగ్రెస్ మహిళా నేత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ చిదంబరం చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. బిజెపిని ఓడించే భాద్యత ప్రాంతీయ పార్టీలకు అప్పగించారా?? అని ఆమె చిదంబరాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.

అసలు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన దగ్గరనుండే ఢిల్లీ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైన దగ్గరనుండి స్థానిక నాయకత్వం గ్రూపులుగా విడిపోయి పార్టీ పరువుని బజారుకీడ్చారు. కనీసం ప్రచారంలో కూడా కాంగ్రెస్ లోని పెద్ద తలలు సైతం ప్రచారానికి దూరంగా వున్నారు. అజయ్ మాకెన్, సుర్జీత్ వాలా వంటి నేతలున్నప్పటికీ పార్టీని ముందుండి నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఓటమిపై నివేదిక తెప్పించుకొనే పనిలో ఉన్న ఎఐసిసి స్థానిక నాయకత్వాన్ని వివరణ కోరే అవకాశం వుంది.

ఇది ఇలా ఉంటే 2015 ఎన్నికల్లో 9.7 % ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి మాత్రం 5 శాతానికే పరిమితమయింది. ఈ ఎన్నికల్లో సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు, ముస్లిం ల ఓట్లన్నీ గంపగుత్తగా AAP కే పోలయ్యాయి. బిజెపి ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ కంటే AAP వైపే ముస్లిం ఓటర్లు మొగ్గు చూపారు. కాంగ్రెస్ కు చెందిన ముస్లిం ఓటు బ్యాంక్ గంపగుత్తగా AAP కి బదిలీ అయినట్టు ఫలితాల సరళిని బట్టి తెలుస్తుంది. AAP తరపున ఐదుగురు ముస్లిం అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచు కోట అయిన ఓఖ్లా.. ( ఇటీవలకాలంలో CAA పై ఆందోళనలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న షాహిన్ భాగ్, జామియా యూనివర్సిటీ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి) మోహ్రాలి.. సీలంపూర్.. మతియా.. వంటి నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు భారీ ఆధిక్యతతో విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి