iDreamPost

ఇక చంద్రబాబు వాదనలు వినబోమన్న ఏసీబీ కోర్టు

ఇక చంద్రబాబు వాదనలు వినబోమన్న ఏసీబీ కోర్టు

గత వారం రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఐటీ సోదాల్లో తన బండారం అంతా బయటపడుతుండడంతో దిక్కుతోచక హైదరాబాద్‌కు మకాం మార్చిన ఆయనకు.. అత్త పెట్టిన కేసు నీడలా వెంటాడుతోంది. ఇన్నాళ్లూ స్టేల మీద స్టేలు తెచ్చుకుంటూ న్యాయస్థానానికి దొరక్కుండా పథకాలు వేస్తున్న ఆయనకు ఈసారి షాక్‌ కొట్టింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు సంపాదించడంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలంటూ నందమూరి లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై కేసులో ఇకపై చంద్రబాబు తరఫు వాదనలు వినబోమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఈనెల 26న పూర్తిస్థాయి విచారణ చేస్తామని పేర్కొంది.

లక్ష్మీపార్వతి పెట్టిన కేసేంటి?

‘‘చంద్రబాబు తొలిసారి 1978లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెల జీతం రూ. 350. ఆ తర్వాత కొన్నాళ్లు మంత్రిగా నెల జీతం రూ. 2,500.. ఇలా మొత్తం ఐదేళ్లు రూ. 74 వేలు సంపాదించారు. చట్టసభ సభ్యునిగా చంద్రబాబు ఆదాయం 2005 నాటికి రూ. 7.38 లక్షలుగా ఉండాలి. అయితే 2005 నాటికి వారి కుటంబ ఆస్తుల విలువ ఏకంగా 21 కోట్లకు పెరిగిపోయింది. ఈ సమయంలోనే హెరిటేజ్‌ కంపెనీని మొదలుపెట్టి చంద్రబాబు ఐదు నెలల పాటు రూ. 20వేల చొప్పున తీసుకున్నారు. ఇలా కేవలం వేలల్లో జీతాలు తీసుకునే ఆయన ఆదాయం ఎలా కోట్ల రూపాయలకు చేరింది?’’ దీనిపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 2005లో నందమూరి లక్ష్మీపార్వతి కేసు వేశారు. అప్పుడు హైకోర్టు నుంచి స్టే పొందిన చంద్రబాబు.. తనపై విచారణ జరగకుండా 14 ఏళ్లుగా అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు గత ఏడాది ఒక కేసులో జారీ చేసిన మార్గదర్శకాల్లో మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలలు మించరాదని తీర్పునిచ్చింది. దీనికి అనుగుణంగా తన ఫిర్యాదుపై విచారణ జరపాలని ఇటీవల లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరగుతోంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబును కోర్టు బోనులోకి ఎక్కించి తీరుతానని లక్ష్మీపార్వతి నమ్మకంగా ఉన్నారు. పరిస్థితుల చూస్తుంటే అవి నిజమయ్యేలా కనపడుతోంది. ఏం జరుగుతుందో ఈనెల 25న చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి