iDreamPost

దళపతి విజయ్ కీలక నిర్ణయం.. రాజకీయాల్లోకి ఫుల్ టైమ్ ఎంట్రీ!

  • By singhj Published - 03:01 PM, Wed - 12 July 23
దళపతి విజయ్ కీలక నిర్ణయం.. రాజకీయాల్లోకి ఫుల్ టైమ్ ఎంట్రీ!

మన దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు కాస్త వైవిధ్యమనే చెప్పాలి. అక్కడ కింది స్థాయి అంచెలంచెలుగా ఎదిగి లేదా ఉద్యమాలతో క్రేజ్ తెచ్చుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వారు ఉన్నారు. అదే టైమ్​లో సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీతో సీఎం కుర్చీని అధిరోహించిన వారూ ఉన్నారు. తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. అక్కడ టాప్ స్టార్లుగా వెలుగొందే నటులు ఏదో ఒక పార్టీతో అనుబంధాన్ని కొనసాగించడం, వారికి మద్దతుగా నిలవడం ఎప్పటి నుంచో వస్తోంది. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఎంజీఆర్, జయలలిత లాంటి వారితో పాటు తన రచనలతో సినీ ప్రేక్షకులను మెప్పించిన కరుణానిధి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని అభిమానులను ఊరించి, ఊరించి.. చివరకు అనారోగ్య కారణాల వల్ల ఆ ఆలోచననను విరమించుకున్నట్లు చెప్పారు. రజినీ రాకపోయినా ఆయన సహచర హీరో కమల్ హాసన్ మాత్రం పాలిటిక్స్​లోకి అడుగుపెట్టారు. ఆయన తన పంథాలో తాను రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలో మరో తమిళ హీరో నడవాలని డిసైడ్ అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్​కు తమిళ నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్స్​తో తమిళ నాట నంబర్ వన్ హీరోగా ఆయన కొనసాగుతున్నారు.

అలాంటి విజయ్​ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయాల్లోకి రానున్నారనే న్యూస్ మరోసారి గుప్పుమంది. ‘లియో’ షూట్​ పూర్తి చేసిన విజయ్ కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదట. ఇదే ఆయనకు ఆఖరి మూవీ అని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం తన అభిమాన సంఘాలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఇకపై చిత్రాల్లో నటించబోనని ఫ్యాన్స్​కు విజయ్ చెప్పినట్లు తమిళ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న విజయ్​ పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పాదయాత్రతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని.. ఇక మీదట పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారని సమాచారం. అయితే ఈ పాదయాత్రపై విజయ్ వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఇదిలా ఉంటే.. ‘లియో’ మూవీ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నెక్స్ట్ మూవీ ఉంటుందని ఇదివరకే ఒక ప్రకటన వచ్చింది. కాగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో విజయ్ కొత్త సినిమా ఉంటుందంటూ మరో గాసిప్ బయటకు వచ్చింది. ఈ రూమర్లలో ఏది నిజం అవుతుందనేది చూడాలి.