iDreamPost

రజినీకాంత్​తో లోకేష్ కనగరాజ్.. ‘జైలర్’ ప్రొడ్యూసర్ మాస్టర్ ప్లాన్!

  • Author singhj Published - 12:04 PM, Mon - 11 September 23
  • Author singhj Published - 12:04 PM, Mon - 11 September 23
రజినీకాంత్​తో లోకేష్ కనగరాజ్.. ‘జైలర్’ ప్రొడ్యూసర్ మాస్టర్ ప్లాన్!

ఒకే ఒక్క మూవీతో తానేంతో, తన సత్తా ఏంటో మరోమారు నిరూపించారు తలైవా రజినీకాంత్. ఆయన నటించిన ‘జైలర్’ చిత్రం గత నెలలో విడుదలై డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ‘రోబో 2.O’ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్న రజినీకి ‘జైలర్’ రూపంలో భారీ ఊరట లభించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.650 కోట్లకు పైచిలుకు కలెక్షన్స్ సాధించి ట్రేడ్ ఎక్స్​పర్ట్స్​ను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళంలోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ విడుదలై అన్నింటా విజయభేరి మోగించింది. రజినీకి హిట్ వస్తే ఈ రేంజ్​లో వసూళ్లు ఉంటాయా అనేలా ‘జైలర్’ రన్ సాగింది.

‘జైలర్’ సినిమా కోసం మూవీ టీమ్ పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పితే ఏమీ చేయలేదు. కానీ ఆడియెన్స్​లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో కంటెంట్ మరీ అదిరిపోయేలా లేకపోయినా అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్, రజినీకాంత్ స్టైలిష్ యాక్టింగ్ ఆడియెన్స్​ను సీట్లలో కట్టిపడేశాయి. వీళ్లిద్దరి మ్యాజిక్​ను చూసేందుకు ప్రేక్షకులు రిపీటెడ్​గా థియేటర్లకు వెళ్లారు. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద పోటీనిచ్చే సినిమాలు కూడా లేకపోవడంతో ‘జైలర్’ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది.

‘జైలర్’ మూవీకి భారీగా వసూళ్లు రావడంతో లాభాల్లో నుంచి రజినీకాంత్​తో పాటు డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్​ అనిరుధ్​కు నిర్మాత కళానిధి మారన్ ఖరీదైన కార్లను గిఫ్ట్​లుగా అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘జైలర్’ సక్సెస్​తో ఫుల్ హ్యాపీగా ఉన్న రజినీకాంత్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. ఈ సమయంలో ‘జైలర్’ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నుంచి ఆసక్తికర ప్రకటన వచ్చింది. సంచలన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీ తదుపరి చిత్రం చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మూవీకి కళానిధే ప్రొడ్యూసర్​గా వ్యవహరించనున్నారు. ‘తలైవర్ 171’ అనే వర్కింగ్ టైటిల్​తో రజినీకాంత్ నెక్స్ట్ మూవీ తెరకెక్కనుంది. ‘జైలర్​’కు అదిరిపోయే ట్యూన్లు అందించిన అనిరుధ్ రజినీ తదుపరి చిత్రానికీ సంగీతం సమకూర్చనున్నారు.

‘తలైవర్ 171’ పవర్​ఫుల్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్​తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీయాలని కళానిధి మారన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్​ తీసిన లోకేష్ కనగరాజ్​తో రజినీ జత కట్టడంతో ‘తలైవర్ 171’పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది లోకేష్ కనగరాజ్ యూనివర్స్ (ఎల్​సీయూ)లో భాగంగా రూపొందనుందా? లేదా వేరే కొత్త కథతో ఈ మూవీని లోకేష్ ప్లాన్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రజినీ-లోకేష్ లాంటి క్రేజీ కాంబోను ఫిక్స్ చేసిన ‘జైలర్’ నిర్మాతది మాస్టర్ ప్లాన్ అనే చెప్పాలి.

ఇదీ చదవండి: ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డును సాధించిన షారుక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి