iDreamPost
android-app
ios-app

బెంగుళూరు ఆటో డ్రైవర్స్‌తో జాగ్రత్త! ఘరానా మోసం!

బెంగుళూరు ఆటో డ్రైవర్స్‌తో జాగ్రత్త! ఘరానా మోసం!

మనం ఏదైనా కొత్త ఊరు, కొత్త ప్రాంతానికి వెళితే.. తొలుత ఆశ్రయించేది ఆటో వాళ్లనే. ప్లేసు, ఇతర వివరాలు చెప్పి అక్కడకు వెళ్లాలని చెబుతాం. ఇక మనం ఆ నగరానికి కొత్త అని తెలిస్తే మాత్రం.. కిలో మీటర్ దూరాన్ని కూడా 15 కిలోమీటర్లలా చూపించి డబ్బులు దోచేస్తుంటారు ఆటో డ్రైవర్. ఆటోలో ఎక్కించి.. అక్కడక్కడే తిప్పుతూ.. మనం చెప్పిన ప్రాంతంలో దించేస్తారు. కాస్త దూరం ఎక్కువయ్యిందంటూ మాట్లాడుకున్న దాని కన్నా ఎక్కువ వసూలు చేస్తారు. ప్రశ్నిస్తే గొడవకు దిగుతారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలే.. ఊరి కాని ఊరిలో ఈ గొడవలు ఎందుకులే అని ఆటో డ్రైవర్ అడిగిన డబ్బులు ఇచ్చి ఊపిరి తీసుకుంటుంటారు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారైనా ఎదురయ్యే ఉంటాయి. అయితే ఇప్పుడు ఊబర్, ర్యాపిడో వంటి యాప్స్ వచ్చి లోకేషన్ ఆధారంగా ప్రయాణం సులువు అవుతుంది. అయితే కొన్ని సార్లు నేరుగా ఆటో డ్రైవర్లను అనుసరిస్తే చుక్కలు చూపిస్తారు.

తాజాగా ఓ యూట్యూబర్‌కు ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. బంగ్లాదేశ్‌కు చెందిన యూట్యూబర్ ఎండీ ఫిజ్ బెంగళూరుకు వచ్చాడు. అక్కడ ఓ ఆటో ఎక్కాడు. తాను చెప్పిన ప్రాంతానికి ఆటో డ్రైవర్ తీసుకెళ్లాడు. ఆటో దిగగానే రూ.300 అయ్యిందని చెప్పగా.. రూ. 500 కాగితాన్ని ఇచ్చాడు ఫిజ్. దాన్ని వెంటనే తన షర్ట్ మడతలో దాచేసి..తన చేతిలో ఉన్న వంద రూపాయలు చూపించి..మీరు వందే ఇచ్చారు అంటూ చెప్పాడు. దీంతో ఆ యూట్యూబర్ తాను పొరబడ్డాననుకుని మరో రూ. 500 నోటు ఇచ్చాడు. తిరిగి అతడు చిల్లర ఇవ్వబోతుంటే ఉంచుకోమని చెప్పాడు. అయితే ఇదంతా యూట్యూబర్ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను ఎడిట్ చేస్తుండగా.. ఈ షాకింగ్ విషయం బయటపడింది. దీంతో డ్రైవర్ చేసిన ఘరానా మోసాన్ని తన యూట్యూబ్ చానల్‌లో పోస్టు చేశాడు. ఇటువంటి బెంగళూరు డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండాలంటూ పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది ఆటో డ్రైవర్లతో తమకు ఎదురైన అనుభవాల గురించి నెమరువేసుకుంటున్నారు.