చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని! కాంట్రవర్సీపై క్లారిటీ!

రాజకీయ నాయకులంటే ఎప్పుడు విమర్శలు మాత్రమే కాదు.. వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఎన్ని విమర్శలు చేసినా.. అవి పార్టీల వరకే పరిమితం. వ్యక్తిగతంగా మాత్రం అందరి మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. పార్టీలకతీతంగా నేతలంతా.. వారి వారి ఇండ్లలో జరిగే ప్రైవేట్‌ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఇదే సీన్‌ కనిపించింది. కొడాలి నాని అంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి నాని.. మెగాస్టార్‌ బర్త్‌డే వేడుకల్లో పాల్గొని అందరిని ఆశ్చర్యపరిచారు. మరోసారి రాజకీయాలు, వ్యక్తిగత జీవితం రెండు వేర్వరని నిరూపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు కొడాలి నాని. అనంతరం కేక్ కట్ చేసి, మెగాస్టార్‌ అభిమానులకు అందించారు. ఆ తర్వాత కొడాలి నాని మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు చాలా మంది తప్పుడు ప్రచారం చేశారని.. దమ్ముంటే అవి వాస్తవమని.. వారు నిరూపించాలని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. తాను శ్రీరామ అన్నా.. టీడీపీ, జనసేనలకు బూతుగానే వినపడుతుంది అన్నారు. తానేం మాట్లాడాడో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసని.. తామంతా క్లారిటీగానే ఉన్నామని చెప్పుకొచ్చారు కొడాలి నాని.

కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అలానే జగన్ గురించి, నా గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతాను. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించేటటువంటి సంస్కారహీనుడును కాను’’ అని చెప్పుకొచ్చారు కొడాలి నాని. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొర్లారు. చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన నేతలు కుట్రలు పన్నారని కొడాలి నాని ఆరోపించారు. అంతేకాక ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారంలో భాగంగా తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి తాను చేతులెత్తి నమస్కారం పెట్టానని ఈ సందర్భంగా గుర్తు చేశారు కొడాలి నాని.

అంతేకాక అనేక సందర్భాల్లో తాను చిరంజీవిని కలిసినట్లు చెప్పుకొచ్చారు కొడాలి నాని. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు. తమకు సూచనలు ఇచ్చినట్లే…. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలని చెప్పానని.. కానీ కొందరు తన వ్యాఖ్యలని వక్రీకరించి.. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదు అని.. తాను అన్నట్లు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రంలో ఉన్న చిరంజీవి గురించి తాను ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతానని కొడాలి నాని ప్రశ్నించారు. తన వెంట ఉన్న వ్యక్తుల్లో 60 శాతం చిరంజీవి అభిమానులే ఉంటారన్నారు.

Show comments