తల్లి కావడం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయంగా చెప్పొచ్చు. పెళ్లయిన ప్రతి మహిళ మాతృత్వపు మాధుర్యాన్ని రుచి చూడాలని కోరుకుంటారు. కొందరి విషయంలో ఇది త్వరగానే నెరవేరుతుంది. అయితే మరికొందరికి మాత్రం తల్లి కావాలనే కోరిక తీరేందుకు చాలా టైమ్ పడుతుంది. అలాంటి వాళ్లు పడే బాధ అంతా ఇంతా కాదు. సమాజం నుంచి వచ్చే విమర్శలు, బంధువుల సూటిపోటి మాటలు వారిని ఎంతగానో బాధిస్తాయి. మాతృత్వపు మాధుర్యం అనేది సామాన్యులకే కాదు.. సెలబ్రిటీల విషయంలోనూ ఒకటే. ఎంత సెలబ్రిటీలైనా వాళ్లకూ జీవితంపై అందరిలాగే ఆశలు, కోరికలు ఉంటాయి.
అలాంటి ఒక ప్రముఖ సెలబ్రిటీ కూడా పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారట. పెళ్లి అయ్యాక పిల్లల కోసం చాలాసార్లు ప్రయత్నించారట. గర్భం దాల్చడానికి ఏకంగా 14 సార్లు ప్రయత్నించినా ఆ జంట ప్రయత్నాలు ఫలించలేదట. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేదట. కానీ ఒక స్టార్ హీరో సలహాతో తమ సంతానం కోరికను నెరవేర్చుకున్నట్లు తెలిపారు. ఈ జంట ఎవరో కాదు.. కశ్మీరా షా, కృష్ణ అభిషేక్. బాలీవుడ్లో ఈ కపుల్‌కు మంచి గుర్తింపు ఉంది. పాపులర్ కామెడీ షో కపిల్ శర్మ షోలో ఈ జంటల పలుమార్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. కశ్మీరా షా పలు హిందీ సినిమాలతో పాటు తెలుగు, భోజ్‌పురి, మరాఠీలోనూ కొన్ని మూవీస్‌లో యాక్ట్ చేశారు. బిగ్ బాస్ 1, నాచ్ బలియే 3, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 1 షోల్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.
2003లో బ్రాడ్ లిట్టర్మాన్ను పెళ్లాడారు కశ్మీరా షా. అయితే మ్యారేజ్ అయిన నాలుగేళ్లకే ఈ భామ విడిపోయారు. అనంతరం 2013లో ప్రముఖ నటుడు, టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట పిల్లల కోసం చాలా ప్రయత్నించారు. గర్భం దాల్చేందుకు ఐవీఎఫ్ ద్వారా కూడా ప్రయత్నించారు. అయినా సక్సెస్ కాలేదట. అయితే వీరికి ఇంతలోనే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక మంచి సలహా ఇచ్చారట. సరోగసీ ద్వారా బిడ్డను ప్లాన్ చేయాలని సూచించారట. అదే వారి జీవితాన్ని మార్చేసింది. ఆయన సలహాతో కశ్మీరా, కృష్ణ దంపతులు సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు. సంతానం లేక చాన్నాల్లు బాధపడిన ఈ స్టార్ కపుల్.. ఎట్టకేలకు సల్లూ భాయ్ సూచనతో పేరెంట్స్ అయ్యారు.