సాధారణంగా ప్రముఖులు ఉపయోగించిన వస్తువులను వారి గుర్తుగా వేలం వేస్తూ ఉంటారు. ఇలా వేలానికి వచ్చిన వస్తువులను అభిమానులు లక్షలు, కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా అలాగే వేలానికి వచ్చింది పాప్ కింగ్, బ్రేక్ డ్యాన్స్ రారాజు మైఖేల్ జాక్సన్ ధరించిన టోపీ. జాక్సన్ సిగ్నేచర్ స్టెప్ అయిన మూన్ వాక్ ఎంత ఫేమసో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఆ స్టెప్ లో అతడు ధరించిన టోపీ కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఈ స్టెప్ లాస్ట్ లో జాక్సన్ తన ముఖానికి టోపీని స్టైల్ గా అడ్డుపెట్టుకునేవాడు. తాజాగా ఈ టోపీని వేలం వేశారు. మరి జాక్సన్ టోపీ ఎన్ని లక్షలకు అమ్ముడు పోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాప్ సింగర్, బ్రేక్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ టోపీ తాజాగా పారిస్ లో వేలం వేశారు. ఈ టోపీ 77,640 యూరోలకు అమ్ముడు పోయింది. దీని విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 68 లక్షలా 22 వేలకు పైనే అన్నమాట. దీంతో మైఖేల్ జాక్సన్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా అతడి క్రేజ్ మాత్రం తగ్గలేదని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ఇక గతేడాది జాక్సన్ వాయించిన గిటార్ ను వేలానికి పెట్టగా.. అది ఏకంగా మూడు కోట్లకు అమ్ముడుపోయింది. ఇది అప్పట్లో ఓ సెన్సేషన్నే క్రియేట్ చేసింది.
అయితే గతంలో జాక్సన్ వస్తువుల వేలానికి అంటూ నకిలీ విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అసలు వస్తువులకు డిమాండ్ అమాంతం తగ్గిపోయింది. ఇదిలా ఉండగా.. జాక్సన్ బయోపిక్ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో జాక్సన్ తమ్ముడు కొడుకు జాఫర్ హీరోగా నటించనున్నాడు. ఈ మూవీకి ఆంటోని దర్శకత్వం వహిస్తుండగా.. మూడు సార్లు ఆస్కార్ విజేత అయిన జాన్ లోగన్ ఈ మూవీకి కథను అందిస్తున్నాడు. ప్రస్తుతం మైఖేల్ జాక్సన్ టోపీ వేలం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.