iDreamPost
android-app
ios-app

గణేష్‌ మాస్టర్‌ మంచి మనసు.. ‘రాకేష్‌ మాస్టర్‌ పిల్లల బాధ్యత మాదే!’

  • Published Jun 19, 2023 | 1:42 PM Updated Updated Jun 19, 2023 | 1:42 PM
  • Published Jun 19, 2023 | 1:42 PMUpdated Jun 19, 2023 | 1:42 PM
గణేష్‌ మాస్టర్‌ మంచి మనసు.. ‘రాకేష్‌ మాస్టర్‌ పిల్లల బాధ్యత మాదే!’

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ అనారోగ్యం కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. జూన్‌ 18, ఆదివారం సాయంత్రం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో పలువురు కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు.. రాకేష్‌ మాస్టర్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్‌ కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్‌ మాస్టర్‌, గణేష్‌ మాస్టర్‌ తదితరులు.. రాకేష్‌ మాస్టర్‌ దగ్గరే డ్యాన్స్‌ నేర్చుకున్నారు. రాకేష్‌ మాస్టర్‌ తన కెరీర్‌లో సినిమాలతో కన్నా.. వివాదాలతో పాపులర్‌ అయ్యాడు. యూట్యూబ్‌ చానెల్స్‌కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సెలబ్రిటీల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచాడు. రాకేష్‌ మాస్టర్‌ మృతి నేపథ్యంలో పలువురు కొరియోగ్రాఫర్లు.. ఆయనను కడసారి చూసేందకు తరలి వచ్చి నివాళులర్పిస్తున్నారు.

రాకేష్‌ మాస్టర్‌ మృతి నేపథ్యంలో కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌.. ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు గణేష్‌ మాస్టర్‌. రాకేష్‌ మృతి నేపథ్యంలో ఆయన పిల్లల బాధ్యత తమదే అన్నారు. ఈ సందర్భంగా గణేష్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. ‘‘రాకేష్‌ మాస్టర్‌ మృతి చాలా బాధాకరం. టాలీవుడ్‌ డ్యాన్స్‌ పరిశ్రమకు ఆయన పెద్ద దిక్కులాంటి వారు. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారు. ఆయనతో పని చేసినా.. చేయకపోయినా ఆయన మాకు గురువే. మా సీనియర్లందని మేం గురువులుగానే భావిస్తాం. రాకేష్‌ మాస్టర్‌ ఇంత సడెన్‌గా మృతి చెందుతారని భావించలేదు. ఆయన వీడియోలు చూస్తూ ఉంటాను. ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉన్నారు కదా.. చాలు అనుకునేవాడిని’’ అని చెప్పుకొచ్చారు.

‘‘టాలీవుడ్‌ డ్యాన్స్‌ పరిశ్రమకు ముక్కురాజు మాస్టర్‌ తర్వాత.. రాకేష్‌ మాస్టరే పెద్ద దిక్కు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లు.. నేడు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు. నేడు మేం ఇలా ఉన్నామంటే అందుకు కారణం రాకేష్‌ మాస్టరే. తప్పకుండా ఆయన పిల్లలను ఆదుకుంటాం. ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్లు, డ్యాన్స్‌ మాస్టర్లందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఆయన పిల్లలను ఆదుకుంటాం. ఎవరికి తోచిన సాయం వారు చేస్తారు. త్వరలోనే అందరం.. దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుని.. తప్పకుండా ఆదుకుంటాం’’ అని తెలిపారు. ఇక డ్యాన్సర్లు కష్టాల్ల ఉన్నారంటే.. గణేష్‌ మాస్టర్‌ చూస్తూ ఊరుకోరు. తనకు తోచిన సాయం చేసి మంచి మనసు చాటుకుంటారు. అలానే రాకేష్‌ మాస్టర్‌ పిల్లలను కూడా ఆదుకుంటానని చెప్పడంతో.. ఆయన నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.