Venkateswarlu
Venkateswarlu
ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే వారికి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక, గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో కీలక పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేసిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వారిని మంచి మంచి అవకాశాలు కూడా వరించాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ కన్నుమూశారు. 30 ఏళ్ల అతి చిన్న వయసులో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిపోయారు.
ఆగస్టు 11న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని డారెన్ కెంట్ క్లయింట్‌గా ఉన్న టాలెంట్ సంస్థ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అఫిషియల్ ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో ..‘‘ మా క్లైయింట్, మిత్రుడు డారెన్ కెంట్ ఇకలేడు అని చెప్పటానికి ఎంతో చింతిస్తున్నాము. ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము’’ అని పేర్కొంది. కాగా, డారెన్ కెంట్ ఎసెక్స్‌లో జన్మించారు. నటన మీద ఆసక్తితో సినిమా రంగం వైపు వచ్చారు.
2008లో వచ్చిన ‘‘మిర్రర్స్’’ అనే హర్రర్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. స్నో వైట్ అండ్ హట్స్‌మ్యాన్, మార్షల్స్ లా, బ్లడీ కట్స్, ది ఫ్రాంకైన్ స్టీన్ క్రోనిక్స్, బ్లడ్ డ్రైవ్, బర్డ్స్ సారో వంటి సినిమాల్లో నటించారు. డారెన్ తన నటనకు గానూ పలు అవార్డులను సైతం గెలుచుకున్నారు. డారెన్ ‘‘ డుంజన్స్ అండ్ డ్రాగన్స్’ అనే సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి, అతి చిన్న వయసులో డారెన్ కెంట్ మృతి చెందడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.