టెలివిజన్ చరిత్రలో బిగ్‌బాస్ షో పెద్ద సంచలనమనే చెప్పాలి. ఈ షో కాన్సెప్ట్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అదే టైమ్‌లో దీన్ని ఇష్టపడేవారు, చూసేవారి సంఖ్య కూడా పెరిగింది. టీఆర్పీల పరంగానూ బిగ్‌బాస్ దూసుకుపోతోంది. ఒక్క తెలుగే కాదు తమిళం, కన్నడ, హిందీల్లోనూ బిగ్‌బాస్ షోను నిర్వహిస్తున్నారు. ఆయా భాషల్లో అక్కడి స్టార్ హీరోలు ఈ షోను హోస్ట్ చేస్తుండటం గమనార్హం. బిగ్‌బాస్ ద్వారా ఎంతోమంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరు కన్నడ యాంకర్, నటి చైత్రా వాసుదేవన్. కన్నడ బిగ్‌బాస్ షో ద్వారా ఆమె క్రేజ్ పెరిగింది.
యాంకర్‌గా, నటిగా మంచి పేరు తెచ్చుకున్న చైత్రా వాసుదేవన్.. బిగ్‌బాస్ షో ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. అలాంటి చైత్ర కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన భర్తతో విడిపోతున్నట్లు ఆమె ప్రకటించారు. డివోర్స్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చైత్ర వెల్లడించారు. ఎన్నో నెలలు ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పేందుకు సిద్ధమయ్యానని ఆమె తెలిపారు. సత్య, తాను విడిపోయామని.. తమ విడాకుల గురించి ఎవరూ అసభ్యంగా మాట్లాడొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు చైత్ర. తమ గురించి చెడుగా మాట్లాడొద్దని కోరారు.
ఎవరి మీదా ద్వేషం చూపించొద్దన్నారు చైత్రా వాసుదేవన్. తమను జడ్జ్ చేయొద్దని.. దీని నుంచి బయటపడేందుకు చాలా టైమ్ పడుతోందన్నారు. లైఫ్‌లో ముందుకు వెళ్లాలంటే ముందు తాను తన ప్రొఫెషన్లో తలమునకలయ్యేంత బిజీగా మారాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. టెలివిజన్ రంగంలో చాన్నాళ్లుగా పనిచేస్తున్నానని.. ఇక మీదటా అక్కడే కొనసాగాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. అందుకే అభిమానుల ప్రేమాభిమానాలు కావాలని చైత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. కాగా, 2017లో సత్య నాయుడు అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడారు. ఎప్పుడూ అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు.