SNP
SNP
ప్రజా యుద్దనౌకగా పేరుగాంచిన గద్దర్ ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే గద్దర్‌పై 25 ఏళ్ల క్రితం జరిగిన భయంకరమైన హత్యాయత్నం గురించి చాలా మందికి తెలిసి ఉండదు. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి ఆయన బయటపడ్డారు. ఆ తర్వాత ఆయన మరణించేంత వరకు ఆయన శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది. దాదాపు 25 ఏళ్లకు పైగా ఆయన ఆ బుల్లెట్‌తో పాటే జీవిస్తున్నారు.
1997లో అల్వాల్‌లోని ఆయన ఇంట్లో ఉండగా.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. ఆ దాడిలో ఆయన శరీరంలోకి ఏకంగా ఐదు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంతో శ్రమించిన ఆయన శరీరం నుంచి నాలుగు బుల్లెట్లను తొలగించారు. కానీ, ఒక బుల్లెట్‌ను మాత్రం తీయలేకపోయారు. గాంధీ నుంచి ఆయనను నిమ్స్‌కు తరలించి.. అక్కడ ఐదో బుల్లెట్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. కానీ, అది తీస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు దాన్ని అలాగే ఉంచేశారు. ఆ ఐదోవ బుల్లెట్ వెన్నెముక వద్ద ఉండిపోయింది.
అయితే అప్పట్లో దాంతో ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉడకపోయేది. కానీ వయసు పెరిగేకొద్ది నొప్పి తీవ్రమైందని.. చికిత్స కోసం నేను క్రమం తప్పకుండా నిమ్స్‌కు వెళ్లాల్సి వచ్చేదని గద్దర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే గద్దర్‌పై నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాల్పుల ఘటనపై విచారణ జరిపేందుకు ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా.. ఆ కేసు కొట్టేశారని, కానీ, తనకు సరైన కారణం చెప్పలేదని కూడా గద్దర్ పేర్కొన్నారు. అయితే గద్దర్‌పై పోలీసుల మద్దతుతోనే కాల్పులు జరిగాయని ఆయన మద్దుతుదారులు ఇప్పటికీ నమ్ముతారు. అలాగే మావోయిస్టుల అరాచకాలకు బలైన బాధితులు ఆయనపై కాల్పులు జరిపారని పోలీసు అధికారులు పేర్కొంటారు. మరి ఇందులో ఏది నిజమో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా.. ఆయన 25 ఏళ్లుగా బుల్లెట్లుతోనే సహజీవనం చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.