Rythu Bandhu: తుమ్మల కీలక ప్రకటన.. ఇక నుంచి వారికి మాత్రమే రైతుబంధు

రైతు బంధుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇకపై వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

రైతు బంధుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇకపై వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని ప్రకటించారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సంచలన నిర్ణయాలతో పాలనలో ముందుకు సాగుతోంది. సంక్షేమ పథకాలు అందిస్తూనే.. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. అలానే కొన్ని ముఖ్య పథకాల్లో చోటు చేసుకున్న కుంభకోణాలను కూడా ప్రజలకు ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. వీటిల్లో ముఖ్యమైనది రైతుబంధు పథకం. సాగు భూములకు కాకుండా.. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇచ్చారని, అసలైన రైతులకు కాకుండా భూస్వాములకు, ఎన్నారైలకు డబ్బులు ముట్టజెప్పారని రేవంత్ సర్కార్ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుబంధు పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ లోక్ సభ ఎన్నికలు ముగియగానే రైతుభరోసాకు సంబంధించి కొత్త విధివిధానాలు విడుదల చేసి.. అర్హులైన రైతులకు మాత్రమే పంట పెట్టుబడి అందించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్‌లోని గుబ్బలమంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి తుమ్మల.. మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ’’తెలంగాణలో ఐదెకరాల వరకు భూములున్న 64.75 లక్షల మంది రైతుల అకౌంట్లలో 5574.77 కోట్ల రూపాయలను జమ చేశాము. ఇంకా కొద్దిమంది మాత్రమే మిగిలారు.. త్వరలోనే వారికి కూడా రైతుబంధు జమ చేస్తాము. రాష్ట్రంలో 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు 92 శాతం ఉండగా.. వాళ్లందరికీ రైతుబంధు జమ చేశాము.. మిగతా 8 శాతం రైతులకు కూడా త్వరలోనే రైతుబంధు ఇస్తాము‘‘ అని చెప్పుకొచ్చారు.

అంతేకాక కేవలం పంటలు సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించాలని తమ ప్రభుత్వం భావిస్తుందని.. అందుకు తగ్గట్టుగానే రైతుభరోసా పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి.. అసెంబ్లీలో చర్చించి అందరి సలహాలు, సూచనలు తీసుకుని తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. గత ప్రభుత్వంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సాగుచేయని భూములకు, ఔటర్ భూములకు, గుట్టలు, పుట్టలు, వ్యవసాయం చేయని భూములకు రైతుబంధు వేశారని చెప్పుకొచ్చారు.

కానీ.. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. నిజమైన రైతుల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా.. కేవలం అసలైన అర్హులకే రైతుబంధు అందేలా చూస్తామన్నారు. పంటలు సాగుచేస్తున్న రైతులకు మాత్రమే రైతుబంధు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అలానే తమ ప్రభుత్వం ఇచ్చిన మరో హామీ రుణమాఫీ అమలకు సంబంధించి కూడా  బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నామని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. 2 లక్షల రుణమాఫీపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Show comments