Arjun Suravaram
Arjun Suravaram
ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన రవాణా వ్యవస్థలో ఆర్టీసీ ఒకటి. ఇది నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సదుపాయలతో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది. ప్రజలకు అనేక రకాల సర్వీసులను ఆర్టీసీ అందిస్తుంది. టీఎస్ ఆర్టీసీ తరచూ ప్రయాణికులకు శుభవార్త చెప్తూ ఉంటుంది. తాజాగా మరో శుభవార్తను టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు చెప్పింది. ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టి-9 టికెట్’ సమయాల్లో మార్పులు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
టీఎస్ ఆర్టీసీ.. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా టీ-9 టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్తిస్తుండేది. ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలో మీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చేయొచ్చు. జూన్ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ టికెట్ విషయంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీ-9 టికెట్ సమయాల్లో మార్పులు చేసింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది.
ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. అంతేకాక టి-9 టికెట్ ద్వారా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే అవకాశం కూడా టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. ప్రయాణికులు రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. అలానే తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబినేషన్ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగు ప్రయాణ సమయంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీనేషన్ టికెట్ వర్తిస్తుంది. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.
“టి-9 టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలి. అదే విధంగా ఆర్టీసీ సంస్థను ఆదరించాలి” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. మరి.. టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.