Dharani
TSRTC Recruitment: నిరుద్యోగులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ రిక్రూట్‌మెంట్ చేపడతాం అని తెలిపారు. ఆ వివరాలు..
TSRTC Recruitment: నిరుద్యోగులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ రిక్రూట్‌మెంట్ చేపడతాం అని తెలిపారు. ఆ వివరాలు..
Dharani
రిపబ్లిక్ డే నాడు.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ నియామకాలు చేపడతాం అని తెలిపారు. బస్ భవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సజ్జనార్ పతాకావిష్కరణ చేశారు. ఆ తర్వాత సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆర్టీసీలో నియామకాలు చేపడతామని.. అలానే కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామన్నారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే టీఎస్‌ఆర్టీసీ సంస్థ అమలు చేసిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. సంస్థకు చెందిన 7,200 పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణం కోసం కేటాయించిన మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాని తెలిపారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని.. ఈ స్కీమ్ కింద ప్రతిరోజు సగటున 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు.
‘‘మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికులు సంఖ్య పెరగడంతో.. రద్దీ విపరీతంగా పెరిగింది. కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే 1,325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెచ్చేందుకు అనుమతి లభించింది. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. వాటిల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ను చేపడతాం’’ అని చెప్పుకొచ్చారు సజ్జనార్.
అంతేకాక కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించామన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్‌లో వారికి అపాయిట్మెంట్ లెటర్లను అందజేస్తారు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారు అని చెప్పుకొచ్చారు.
సంస్థకు సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటినీ టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు సజ్జనార్. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ ఛాలెంజ్‌ను తీసుకువచ్చినా అధికారులు, సిబ్బంది విజయవంతం చేస్తున్నారని, ఛాలెంజ్ కు తగ్గట్టుగా పనిచేస్తున్నారంటూ అభినందించారు సజ్జనార్.