iDreamPost
android-app
ios-app

Free Journey: TSRTC గుడ్‌న్యూస్.. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ..!

  • Published Mar 12, 2024 | 12:14 PM Updated Updated Mar 12, 2024 | 12:14 PM

ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టీఎస్‌ఆర్టీసీ కీలక అప్డేట్‌ ఇచ్చింది. ఇకపై ఆ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది.

ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టీఎస్‌ఆర్టీసీ కీలక అప్డేట్‌ ఇచ్చింది. ఇకపై ఆ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది.

  • Published Mar 12, 2024 | 12:14 PMUpdated Mar 12, 2024 | 12:14 PM
Free Journey: TSRTC గుడ్‌న్యూస్.. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తెలంగాణలోని మహిళలు వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక ఫ్రీ బస్సు జర్నీ పథకం తెచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య మరీ ముఖ్యంగా మహిళల సంఖ్య భారీగా పెరిగింది. రోజు వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత జర్నీ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో.. టీఎస్‌ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు చేపట్టింది. ఇక నగరాల్లోనే ఎక్కువ మంది ఫ్రీ బస్‌ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

దాంతో సిటీలో బస్సులు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కష్టాలను తీర్చడం కోసం టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 22 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అయితే అవి ఎలక్ట్రిక్‌ బస్సులు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ వేదికగా 22 కొత్త బస్సులను ప్రారంభించడానికి ఆర్టీసీ అధికారులు రెడీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించనున్నారు. అద్దె ప్రతిపాదికన మొత్తం 500 బస్సులు తీసుకొంటుండగా.. ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి.

అయితే ఇవి పూర్తిగా నాన్‌ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చేబుతున్నారు. కొత్త బస్సులను ప్రారంభిస్తోన్న నేపథ్యంలో.. టీఎస్‌ఆర్టీసీ మహిళలకు శుభవార్త చెప్పింది. ఈ బస్సుల్లో కూడా ఉచిత జర్నీ పథకం అమల్లో ఉంటుందని.. మహిళలు ఎవరైనా సరే.. తమ ఆధార్‌ కార్డు చూపించి.. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయి. బస్సులను ఛార్జ్ చేసేందుకు బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కంటోన్మెంట్‌, హెచ్‌సీయూ, రాణిగంజ్‌ డిపోల్లో 33 కేవీ పవర్‌ లైన్లు తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్‌ బస్సులను ప్రత్యేకంగా సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్‌లుంటాయని అధికారులు చెప్పారు. ఈ బస్సులు జూన్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు. ఈ బస్సులన్నిటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బస్సులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మహిళలతో పాటు పురుషులకు సీట్లు దొరుకుతాయ్.